NTV Telugu Site icon

WI vs IND 1st ODI: నేడు భారత్, విండీస్‌ తొలి వన్డే.. అందరిచూపు అతడిపైనే!

Rohit, Pooran

Rohit, Pooran

West Indies vs India 1st ODI Today: కరీబియన్‌ గడ్డపై టెస్టు సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్ .. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. కెన్సింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ప్రపంచకప్‌కు ముందు సాధనగా ఉపయోగించుకునే ఈ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయిలో సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు టెస్టుల్లో భారత్‌ ధాటికి నిలవలేకపోయిన వెస్టిండీస్‌.. వన్డేల్లో ఏమాత్రం పోరాడుతుందో చూడాలి.

తుది జట్టులో చోటు కోసం భారత ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రపంచకప్‌ 2023 జట్టులో చోటే లక్ష్యంగా యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో సత్తా చాటాలనుకుంటున్నారు. టీ20ల్లో స్టార్ బ్యాటర్‌గా ఎదిగిన ‘మిస్టర్ 360’ సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో మాత్రం తానేంటో ఇంకా రుజువు చేసుకోలేదు. గతంలో వచ్చిన అవకాశాలను సూర్య ఉపయోగించుకోలేదు. అయితే శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులో లేకపోవడంతో.. సూర్యకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. సిరీస్‌లో పరుగులు చేస్తేనే ప్రపంచకప్‌ నిలుస్తాడు. లేదంటే మెగా టోర్నీ ఆశలు సూర్య భాయ్ వదులుకోవాల్సిందే.

వికెట్‌ కీపర్‌ స్థానం కోసం ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌ పోటీ పడుతున్నాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ, మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌కే చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సంజుకు భారత జట్టులో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని బీసీసీఐపై ఓ అపవాదు ఉంది. దాంతో సంజును ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్‌ ఆడటంపై సందేహాలున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో యువ పేసర్లనూ పరీక్షించబోతున్నారు. శార్దూల్‌ ఠాకూర్, ఉమ్రాన్‌ మాలిక్‌, జైదేవ్‌ ఉనద్కత్‌లతో పాటు కొత్త బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ తుది జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నాడు. ఆర్ జడేజాకు తోడుగా అక్షర్‌ పటేల్‌ లేదా కుల్‌దీప్‌ యాదవ్ ఆడనున్నారు.

టెస్టులతో పోలిస్తే వన్డేల్లో ఆతిథ్య విండీస్‌ పోటీ ఇవ్వనుంది. ఎందుకంటే కొందరు సత్తాచాటే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన కైల్‌ మేయర్స్‌, మరో ఓపెనర్ బ్రెండన్‌ కింగ్‌ దూకుడైన బ్యాటర్లే. కెప్టెన్‌ షై హోప్‌కు వన్డేల్లో మంచి రికార్డే ఉంది. షిమ్రాన్ హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌, రొమారియో షెఫర్డ్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడగలరు. పేస్‌ బౌలర్‌ అల్జారి జోసెఫ్‌కు మంచి రికార్డు ఉంది.

తుది జట్లు (IND vs WI Playing 11):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, హార్దిక్‌, శాంసన్‌/ఇషాన్‌, జడేజా, అక్షర్‌/కుల్‌దీప్‌, శార్దూల్‌, సిరాజ్‌, ఉమ్రాన్‌ /ముకేశ్‌.
వెస్టిండీస్‌: కింగ్‌, మేయర్స్‌, కార్టీ, హోప్‌ (కెప్టెన్‌), హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌, షెఫర్డ్‌, సింక్లయిర్‌, జోసెఫ్‌, మోటీ/కరియన్‌, సీల్స్‌.