NTV Telugu Site icon

Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!

Virat Kohli Speech

Virat Kohli Speech

Virat Kohli React on Gautam Gambhir Conflicts: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ ఎంపికయిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించిన వెంటనే.. చాలా మంది క్రికెట్ అభిమానుల మదిలో ఓ ప్రశ్న మెదిలింది. అదే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగుతాడా? లేదా? అని. వీరిద్దరి మధ్య ఐపీఎల్‌ 2023 సమయంలో చోటుచేసుకొన్న సంఘటనలే ఇందుకు కారణం. అయితే అవన్నీ గతమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పకనే చెప్పడం గమనార్హం.

శ్రీలంక పర్యటనకు జట్ల ఎంపిక ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. తన తొలి పర్యటన కాబట్టి సీనియర్లు అందరూ అందుబాటులో ఉండాలని గౌతమ్ గంభీర్‌ కోరాడు. రోహిత్, కోహ్లీని ప్రత్యేకంగా అడిగాడు. గంభీర్‌ అడగ్గానే మరోమాట లేకుండా వన్డేలు ఆడేందుకు కోహ్లీ అంగీకరించాడు. దీంతో కోహ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎదుట కోహ్లీ తెలిపిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. గంభీర్‌, తనకు మధ్య ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదని బీసీసీఐకి కోహ్లీ భరోసా ఇచ్చాడట.

Also Read: Suryakumar Yadav: గంటలతరబడి వాడీవేడిగా చర్చ.. సూర్యకే ఓటేసిన ప్లేయర్స్!

‘గౌతమ్ గంభీర్‌తో గతంలో చోటుచేసుకొన్న సంఘటనలు ఏవీ కూడా మా బంధంపై ప్రభావం చూపవు. భారత్ జట్టు కోసం ఇద్దరం కలిసి పని చేస్తాం. మా ఇద్దరి లక్ష్యం టీమిండియాను ముందుకుతీసుకెళ్లడమే. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదు’ అని బీసీసీఐకి కోహ్లీ భరోసా ఇచ్చినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐపీఎల్‌ 2023లో లక్నో, బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ, గంభీర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఐపీఎల్‌ 2024లో వీరిద్దరూ ఆలింగనం చేసుకుని.. తమ మధ్య విభేదాలకు పులిస్టాప్ పెట్టారు.

 

Show comments