శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గాల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పలు అరుదైన రికార్డులపై కన్నేశారు.
స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే టెస్ట్ క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే డబ్ల్యూటీసీ చరిత్రలో 3000 రన్స్ పూర్తి చేసిన మొదటి వికెట్ కీపర్‌గా నిలవడానికి పంత్‌కు మరో 220 పరుగులు కావాలి. శ్రీలంకలో ఇప్పటివరకు ఏ భారతీయ వికెట్ కీపర్ కూడా టెస్ట్ సెంచరీ చేయలేదు, ఈసారి పంత్ ఆ రికార్డును సాధించే అవకాశం ఉంది.
మరోవైపు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో 50 సిక్సర్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. విరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించే మూడో భారతీయ ఓపెనర్‌గా అతడు నిలుస్తాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా నిలిచేందుకు జైస్వాల్‌కు మరో 187 పరుగులు అవసరం. అలాగే 24 ఏళ్ల వయసుకే 5 వేర్వేరు దేశాల్లో టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డు సరసన చేరేందుకు అతడికి ఒక శతకం కావాలి.
సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 170 పరుగుల దూరంలో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత విదేశాల్లో 10 టెస్ట్ సెంచరీలు చేసిన రెండో ఆసియా ఓపెనర్‌గా నిలిచేందుకు రాహుల్‌కు రెండు సెంచరీలు అవసరం.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 31 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్‌గా 2000 పరుగులు సాధించడానికి అతడికి 150 పరుగులు, డబ్ల్యూటీసీలో 3000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచేందుకు 157 పరుగులు అవసరం. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత నాయకుడిగా నిలిచేందుకు గిల్‌కు మంచి అవకాశం ఉంది.

