Site icon NTV Telugu

IND vs SL: సూపర్ ఓవర్‌లో హై డ్రామా.. అంపైర్ తప్పిదం, డసన్ షనక తెలివి!

Ind Vs Sl Super Over Drama

Ind Vs Sl Super Over Drama

ఆసియా కప్‌2025 సూపర్-4లో భాగంగా శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో సునాయాసంగా గెలిచింది. సూపర్ ఓవర్‌లో అంపైర్ తప్పిదంతో హైడ్రామా చోటు చేసుకుంది. అంపైర్ తప్పిదం కారణంగా శ్రీలంక బ్యాటర్ డసన్ షనక రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రనౌట్ విషయంలో అందరూ తికమక పడ్డారు. క్లియర్ రనౌట్ అయ్యాక కూడా థర్డ్ అంపైర్ అవుట్ అవ్వలేదని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ గజిబిజికి కారణం ఏంటో తెలుసుకుందాం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. ఛేదనలో లంక కూడా 20 ఓవర్లలో 202 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ బౌలింగ్ చేశాడు. తొలి బంతికే కుశాల్ పెరీరా ఔటయ్యాడు. రెండో బంతికి రాగా.. మూడో బంతికి పరుగు ఏమీ రాలేదు. నాలుగో బంతిని డసన్ షనక షాట్ ఆడగా.. బంతి కీపర్ సంజూ శాంసన్ చేతిలోకి వెళ్లింది. షనక సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. సంజూ రనౌట్ చేశాడు. లెగ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. వికెట్ పడిందని అందరూ సంతోషంలో ఉన్నారు.

Also Read: IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్.. ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై వేటు!

అయితే అంతకుముందే క్యాచ్ ఔట్ కోసం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. ఇక్కడే డసన్ షనక తెలివిగా రివ్యూ తీసుకున్నాడు. క్యాచ్ ఔట్ నిర్ణయాన్ని సవాల్ చేశాడు. రిప్లైలో బంతి బ్యాట్‌కు తాకలేదని తేలింది. దాంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దాంతో టీమిండియా ఆటగాళ్ల‌తో పాటు ఫాన్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. క్లియర్‌గా రనౌట్ అయింది కదా.. రివ్యూ తీసుకోవడం ఏంటి, నాటౌట్ ఇవ్వడం ఏంటని అయోమయానికి గురయ్యారు. రూల్స్ ప్రకారం.. అర్ష్‌దీప్ క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేయగానే అంపైర్ ఔటివ్వడంతో ఆ బంతి డెడ్ బాల్ అయింది. డెడ్ బాల్ అనంతరం పరుగు తీసినా లేదా రనౌట్ అయినా ఉపయోగం ఉండదు. అదన్న మాట అసలు విషయం. మొత్తానికి రూల్స్ తెలిసిన షనక తెలివి ప్రదర్శించినా.. ఆ తర్వాతి బంతికే అవుట్ అవ్వడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.

Exit mobile version