Hard work doesn’t go unnoticed says Hardik Pandya: మరో వారం రోజుల్లో శ్రీలంక పర్యటనకు భారత్ వెళ్లనుంది. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది. రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ముందున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పెట్టిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. శ్రమ ఎప్పటికీ వృథా కాదంటూ అతడు పేర్కొన్నాడు. ఎన్నో కష్టాలను దాటి టీ20 ప్రపంచకప్ 2024ను ముద్దాడినట్లు చెప్పాడు.
‘వన్డే ప్రపంచకప్ 2023లో గాయం తీవ్ర నిరాశకు గురి చేసింది. నా క్రికెట్ ప్రయాణం చాలా కష్టంగా మారింది. చాన్నాళ్లు ఆటకు దూరంగా ఉండిపోయా. టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ నెగ్గడంతో ఇప్పటివరకు పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. గత కొన్ని రోజులుగా చేసిన కష్టం, కృషికి ఇంతకంటే అద్భుతమైన ముగింపు ఉండదు. కఠిన శ్రమ వృథా కాదనేందుకు ఇదొక నిదర్శనం. కష్టపడితే ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది. అత్యుత్తమ ఫిట్‌నెస్‌ను సాధించేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉందాం’ అని హార్దిక్ పాండ్యా రాసుకొచ్చాడు.
Also Read: Crows Viral Video: కాకిని తాడుతో కట్టేసిన చికెన్ షాప్ యజమాని.. రివేంజ్ తీర్చుకున్న కాకుల గుంపు!
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అంటూ ప్రచారం సాగుతున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఈ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్సీపై హార్దిక్ పరోక్షంగా రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు అంటున్నారు. కష్టానికి ఫలితం ఎప్పుడైనా దక్కుతుందని హార్దిక్ పేర్కొనడం కెప్టెన్సీ గురించే అని పేర్కొంటున్నారు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్ దాదాపు 5 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చినా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 144 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు.