NTV Telugu Site icon

Charith Asalanka: వాతావరణం కూడా మాతో ఆడుకుంది: శ్రీలంక కెప్టెన్‌

Charith Asalanka Speech

Charith Asalanka Speech

Captain Charith Asalanka on Sri Lanka Defeat: మిడిలార్డర్‌పై విఫలమవడంపై శ్రీలంక కెప్టెన్‌ చరిత్‌ అసలంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక సమయంలో మిడిలార్డర్‌ బ్యాటర్లు ఆడలేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. తాము అదనంగా 15-18 పరుగులు చేయాల్సిందని, వాతావరణం కూడా తమతో ఆడుకుందని తెలిపాడు. తాము చాలా మెరుగవ్వాల్సి ఉందని అసలంక చెప్పాడు. ఆదివారం టీమిండియాతో జరిగిన వర్ష ప్రభావిత రెండో టీ20లో లంక 7 వికెట్ల తేడాతో ఓడింది. మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్‌ అసలంక మాట్లాడుతూ తమ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు.

‘మేము బ్యాటింగ్ చేసిన విధానం బాగాలేదు. నాతో సహా మిడిలార్డర్‌, లోయరార్డర్ విఫలమైంది. నేను చాలా నిరాశ చెందాను. మేం చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఈ పిచ్‌లో బంతి పాతబడినా కొద్దీ బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారుతుంది. ప్రొఫెషనల్‌ క్రికెటర్లుగా మేం ఇంకా బాగా ఆడాల్సి ఉంది. మేం 15-18 పరుగులు ఎక్కువగా చేయాల్సింది. దురదృష్టవశాత్తు వాతావరణం కూడా దాని పాత్ర పోషించింది. వాతావరణంను మనం నియంత్రించలేము. వర్షం పడటంతో 8 ఓవర్లు బౌలింగ్‌ చేయడం అంత సులభమైన కాదు’ అని శ్రీలంక కెప్టెన్‌ చరిత్‌ అసలంక చెప్పాడు.

Also Read: Suryakumar Yadav: వర్షం మాకు కలిసొచ్చింది: సూర్యకుమార్‌

ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్‌ పెరీరా (53; 34 బంతుల్లో 6×4, 2×6) టాప్‌ స్కోరర్‌. రవి బిష్ణోయ్‌ (3/26) మూడు వికెట్స్ తీశాడు. భారత ఇన్నింగ్స్‌ మొదలవగానే వర్షం పడి గంటకు పైగా మ్యాచ్ ఆగింది. దీంతో లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు. యశస్వి జైస్వాల్‌ (30; 15 బంతుల్లో 3×4, 2×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (26; 12 బంతుల్లో 4×4, 1×6), హార్దిక్‌ పాండ్యా (22 నాటౌట్‌; 9 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడంతో భారత్‌ 6.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Show comments