NTV Telugu Site icon

IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో భారత్ ఘోరపరాభవం!

South Africa Test

South Africa Test

South Africa Beat India in 1st Test: సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఏకంగా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడో రోజైన గురువారం163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్.. దక్షిణాఫ్రికా పేస్‌ ముందు నిలవలేకపోయింది. బర్గర్‌ (4/33), యాన్సెన్‌ (3/36), రబాడ (2/32) ధాటికి 34.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) టాప్ స్కోరర్. ఈ పరాజయంతో దక్షిణాఫ్రికా గడ్డపై 31 ఏళ్లలో తొలిసారి టెస్టు సిరీస్‌ గెలవాలన్న భారత్ ఆశలకు గండి పడింది. ఇక రెండో టెస్టు 2024 జనవరి 3న కేప్‌టౌన్‌లో ఆరంభమవుతుంది.

మూడో రోజు 256/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్‌ సెంచరీ హీరో డీన్ ఎల్గర్‌ (185; 287 బంతుల్లో 28×4) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. యాన్సెన్‌ (84 నాటౌట్‌; 147 బంతుల్లో 11×4, 1×6) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. మూడోరోజు కూడా భారత బౌలర్లు తేలిపోయారు. దక్షిణాఫ్రికాకు 163 పరుగుల ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనైనా పుంజుకుంటారని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌కు విలవిల్లాడిన భారత బ్యాటర్లు.. కనీస ప్రతిఘటన కూడా చేయలేదు. విరాట్ కోహ్లీ తప్ప ఎవరూ ఎక్కవసేపు క్రీజులో నిలవలేదు.

Also Read: Keedaa Cola : ఓటీటీలోకి వచ్చేసిన కీడా కోలా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఓపెనర్లు రోహిత్‌ శర్మ (0), యశస్వి జైస్వాల్‌ (5) త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో శుభ్‌మన్‌ గిల్ (26), విరాట్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఇద్దరూ చకచకా బౌండరీలు బాదడంతో పరుగులు వేగంగా వచ్చాయి. కొన్ని చక్కని షాట్లు ఆడిన గిల్‌ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. టీ విరామం తర్వాత భారత్ పతనం వేగంగా సాగింది. ఓ వైపు కోహ్లీ క్రీజులో నిలిచినా.. మరోవైపు నుంచి బ్యాటర్లు పెవిలియన్‌ చేరారు. శ్రేయస్‌ అయ్యర్ (6), లోకేష్ రాహుల్‌ (4), ఆర్ అశ్విన్‌ (0), శార్దూల్‌ ఠాకూర్ (2), జస్ప్రీత్ బుమ్రా (0), మొహ్మద్ సిరాజ్‌ (4) క్యూ కట్టారు. చివరి వికెట్‌గా విరాట్ వెనుదిరిగాడు. ఈ మ్యాచులో సఫారీ పేసర్లు విజృంభించిన పిచ్‌పై మన పేసర్లు తేలిపోయారు.