IND vs SA 2nd T20I Preview: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్ టాస్ పడకుండానే వర్షంలో కోట్టుకుపోగా.. ఇప్పుడు రెండో టీ20కి కూడా వానముప్పు పొంచి ఉంది. అభిమానులకు మాత్రమే కాదు రూ. కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ)కు కూడా వాతావరణ పరిస్థితులు అడ్డుగా మారాయి. దాంతో రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఆట సజావుగా సాగేనా? లేదో?. గబేహాలో మంగళవారం రాత్రి 8.30కి మ్యాచ్ ఆరంభం కానుంది.
వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. దానికి ముందు భారత జట్టు ఐదు టీ20లు మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లోనే టీమిండియా బ్యాటింగ్ స్థానాలపై ఓ అవగాహనకు రావాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. వచ్చే జూన్‌లో జరిగే మెగా టోర్నీకి జట్టు ఎంపికలో ఆటగాళ్ల ఐపీఎల్ ప్రదర్శన కీలకం కానుంది. నిరుడు టీ20 ప్రపంచకప్ అనంతరం సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పొట్టి ఫార్మాట్ ఆడడం లేదు. మరి వచ్చే మెగా టోర్నీలో వీరిద్దరూ ఆడతారా? లేదా? అనేది సందేహంగా మారింది. ఒకవేళ వీరు అందుబాటులో ఉండకపోతే.. యువ ఆటగాళ్లతోనే భారత్ బరిలోకి దిగాల్సి ఉంటుంది. మొత్తానికి ఐపీఎల్ 2024 తర్వాతే మెగా టోర్నీ జట్టుపై ఓ అవగాహన రానుంది.
ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై భారత్‌ను నడిపించిన సూర్యకుమార్‌కు ఈ సిరీస్ కూడా మంచి అవకాశం. కెప్టెన్సీ నిరూపించుకునేందుకు సూర్యకు ఇంతకంటే మంచి సమయం రాదనే చెప్పాలి. శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మొహ్మద్ సిరాజ్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్‌లు తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్‌కె, బర్గర్‌లను పరీక్షించాలనుకుంటుంది. బవుమా లేని జట్టులో మార్క్‌రమ్ తన మార్క్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రొటీస్ జట్టు సీనియర్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ తప్పకపోవచ్చు.
Also Read: Rythu Bandhu: తెలంగాణ రైతులకు శుభవార్త.. నేటి నుంచే రైతుబంధు నిధుల విడుదల!
తుది జట్లు (అంచనా):
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్, సూర్యకుమార్, రింకు సింగ్, జితేశ్ శర్మ, జడేజా, ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్, బ్రీజ్కె, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, జాన్సన్, కేశవ్ మహరాజ్, కొయెట్జీ, నంద్రీ బర్గర్, షంసి.