India Beat South Africa in 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 297 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టోని జోర్జి (81; 87 బంతుల్లో 6×4, 3×6), ఐడెన్ మార్‌క్రమ్ (36; 41 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. అర్ష్‌దీప్ సింగ్ (4/30) నాలుగు వికెట్స్ పడగొట్టాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో పట్టేసింది. సెంచరీ చేసిన సంజూ శాంసన్ (108; 114 బంతుల్లో 6×4, 3×6)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కగా.. అర్ష్‌దీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
ఈ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రజత్ పటీదార్ (22; 16 బంతుల్లో 3×4, 1×6) పర్వాలేదనిపించాడు. తొలి రెండు వన్డేల్లో అర్ధ సెంచరీలు చేసిన సాయి సుదర్శన్ (10) ఈ వన్డేలో ఎక్కువసేపు నిలవలేదు. 49/2తో ఇబ్బందుల్లో పడిన భారత జట్టును సంజూ శాంసన్ ఆదుకున్నాడు. సంజూ అడపాదడపా ఫోర్లు కొడుతూ.. స్కోరింగ్ రేటు పడిపోకుండా చూశాడు. ముందుగా లోకేష్ రాహుల్‌తో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంజూ.. ఆ తర్వాత తిలక్ వర్మ (52; 77 బంతుల్లో 5×4, 1×6) జతగా ఇన్నింగ్స్‌ను మరో దశకు తీసుకెళ్లాడు. ఇక రింకు సింగ్ (38; 27 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి జోరు కొనసాగించిన శాంసన్.. 110 బంతుల్లో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ (3/63), బర్గర్ (2/64) రాణించారు.
Also Read: Salaar Review: ప్రభాస్ ‘సలార్’ మూవీ రివ్యూ!
ఛేదనను దక్షిణాఫ్రికా ధాటిగా మొదలెట్టింది. రెండో వన్డేలో మెరుపు సెంచరీ చేసిన ఓపెనర్ టోని జోర్జి (81) మరోసారి సత్తా చాటాడు. రీజా హెండ్రిక్స్ (19)తో కలిసి తొలి వికెట్‌కు 59 పరుగులు జత చేశాడు. వాండర్ డెసెన్ (2) త్వరగా ఔటైనా.. మూడో వికెట్‌కు మార్‌క్రమ్ (36)తో కలిసి 65 పరుగులు జోడించాడు. 25 ఓవర్లలో 135/2తో పటిష్ట స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగింది. అయితే స్వల్ప వ్యవధిలో మార్‌క్రమ్, జోర్జి ఔట్ కావడంతో సఫారీ జట్టు ఇబ్బందుల్లో పడింది. మార్‌క్రమ్‌ను సుందర్.. జోర్జిని అర్ష్‌దీప్ ఔట్ చేశారు. ఆపై అవేశ్ బౌలింగ్‌లో క్లాసెన్ (21) వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. మిల్లర్ (10)ను ముకేశ్ పెవిలియన్ చేర్చడంతో దక్షిణాఫ్రికా పోరాటానికి తెరపడింది.
