NTV Telugu Site icon

IND vs SA: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.. భారత్ ఖాతాలో చెత్త రికార్డు!

India Loses 6 Wickets

India Loses 6 Wickets

India loses 6 wickets for 0 runs in 11 balls in Test Cricket: కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌట్ అయింది. కాగిసో రబాడ (3/38), లుంగి ఎంగిడి (3/30), నాంద్రే బర్గర్‌ (3/42) విజృంభించడంతో భారత్‌ 153 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో విరాట్ (46; 59 బంతుల్లో 6×4, 1×6) టాప్‌ స్కోరర్‌. రోహిత్‌ శర్మ (39), శుభ్‌మన్‌ గిల్‌ (36) పర్వాలేదనిపించారు. అయితే ఈ ఇన్నింగ్స్‌ ద్వారా భారత్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తమ చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్‌ వద్ద (153) కోల్పోయింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు పరుగులు ఏమీ చేయకుండా.. చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ తర్వాత 153/4గా ఉన్న భారత్‌ స్కోర్‌.. 11 బంతుల అనంతరం 153/10గా మారింది. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డ​కౌట్లు అయ్యారు. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీలు రెండంకెల స్కోర్ అందుకోగా.. లోకేష్ రాహుల్ 8 పరుగులు చేశాడు. జైస్వాల్, అయ్యర్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్, ముకేష్‌లు డకౌట్స్ అయ్యారు.

Also Read: IND vs SA: ఏడాది తర్వాత టాప్‌-10లోకి విరాట్‌ కోహ్లీ!

అంతకుముందు భారత పేసర్లు మొహ్మద్ సిరాజ్‌, ముకేష్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరగడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్‌ బౌలర్ల ధాటికి సఫారీల ఇన్నింగ్స్‌ లంచ్‌ విరామం లోపే (23.2 ఓవర్లలో) ముగిసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బెడింగ్హమ్‌ (12), వెర్రిన్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత ఇన్నింగ్స్‌లా కాకుండా ప్రొటీస్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లు కనీసం ఒక్క పరుగైనా చేశారు.

Show comments