పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిల్ కూడా దాఖలైంది. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. కేంద్రం కూడా వద్దని చెప్పలేదు. మరోవైపు ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నట్లు బీసీసీఐ కూడా తెలిపింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకమైన నిరసన తెలిపాడు.
ఆసియా కప్ 2025 ఆరంభానికి ముందు ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీతో కరచాలనం చేశాడు. దాంతో సూర్యపై నెట్టింట ట్రోల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో టాస్ సమయంలో ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘాతో సూర్యకుమార్ కరచాలనం చేయలేదు. అలీ కూడా ఈ ఘటనను పట్టించుకోలేదు. మ్యాచ్ అనంతరం కూడా ఇద్దరు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు. దాంతో సూర్యపై టీమిండియా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘శభాష్ సూర్యకుమార్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: IND vs PAK: ఈ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితం!
మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో కూడా మాట్లాడకుండా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా వెళ్లిపోయాడు. భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాభావ ప్రభావవేమో కావచ్చు.. బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడలేదు. అఘాను బ్రాడ్‌కాస్టర్ హోస్ట్ సంజయ్ మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేయలేదు. నిజానికి మ్యాచ్ అనంతరం అఘా బ్రాడ్‌కాస్టర్స్కు కనిపించకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. టీమిండియాపై పాక్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్స్ కోల్పోయి 15.5 ఓవర్లలోనే ఛేదించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాక్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమై మూల్యం చెల్లించుకుంది.
