Site icon NTV Telugu

IND vs PAK: మా వేదనను అప్పుడే మర్చిపోయారా?.. బీసీసీఐపై పహల్గాం బాధితురాలు ఆగ్రహం!

Aishanya Dwivedi Bcci

Aishanya Dwivedi Bcci

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రదర్శించిన పెను ఉన్మాదానికి 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో కాన్పుర్‌కు చెందిన వ్యాపారి శుభమ్‌ ద్వివేది కూడా ఉన్నారు. తన సతీమణి ఐషాన్య ద్వివేదితో కలిసి హనీమూన్‌ కోసం కశ్మీర్‌కు వెళ్లిన శుభమ్‌ను బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు తలపై కాల్చి చంపారు. అప్పటినుంచి ఇషానాయ్‌ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆసియా కప్‌ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ ఆడొద్దని దేశ ప్రజలు, ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్‌ చేశారు. బాయ్‌కాట్ ఆసియా కప్‌ 2025 అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అయితే నిబంధనల మేరకే మ్యాచ్‌ జరుగుతున్నట్లు ఐసీసీ, ఏసీసీ ప్రకటించింది. బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఏ రకంగానూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఐషాన్య ద్వివేది బీసీసీఐపై మండిపడ్డారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది త్యాగాలను బీసీసీఐ విస్మరించిందని ఫైర్ అయ్యారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను అప్పుడే మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.

ఐషాన్య ద్వివేది ఈరోజు ఏఎన్ఐతో మాట్లాడారు. ‘భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను బీసీసీఐ అంగీకరించకుండా ఉండాల్సింది. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోంది. మన క్రికెటర్లు ఏం చేస్తున్నారు?. క్రికెట్ ఆటను మన జాతీయ క్రీడగా చూస్తాం. 1-2 మంది ఆటగాళ్లు తప్ప పాకిస్తాన్‌ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఎవరూ ముందుకు రాలేదు. క్రికెటర్ల తలపై తుపాకీ పెట్టి ఆడమని ఎవరూ బలవంతం చేయరు. పాక్‌తో మ్యాచ్‌ ఆడాలని క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దు. ప్లేయర్స్ దేశం తరపున నిలబడాలి. కానీ మన క్రికెటర్స్ అలా చేయడం లేదు. పాకిస్తాన్‌ మ్యాచ్‌ను ఆడడం సరైంది కాదు’ అని ఐషాన్య ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్‌ సింగ్‌?.. టర్బోనేటర్ టు అడ్మినిస్ట్రేటర్!

‘పహల్గాం దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా? అని స్పాన్సర్లు, క్రికెటర్లను నేను అడుగుతున్నా. ఈ మ్యాచ్‌తో వచ్చిన ఆదాయాన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే ఉపయోగిస్తుంది. పాకిస్థాన్‌ ఒక ఉగ్రవాద దేశం. మీరు వారికి ఆదాయాన్ని అందించి.. మరోసారి మనపై దాడి చేయడానికి వారిని సిద్ధం చేస్తున్నారు. నాకు ఇది అర్థం కావడం లేదు. అభిమానులు ఒక నిర్ణయం తీసుకోవాలి. క్రికెట్ ఫాన్స్ సహా దేశ ప్రజలంతా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను వీక్షించకుండా బహిష్కరించాలి’ అని ఐషాన్య ద్వివేది కోరారు.

Exit mobile version