NTV Telugu Site icon

Team India: టీమిండియా ఆటగాళ్లు కూడా అందరిలాగే: డౌల్‌

Simon Doull

Simon Doull

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఓడిపోయింది. టెస్టు చరిత్రలో భారత గడ్డపై రెండో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది. దీనికి కారణం స్పిన్‌లో మనోళ్లు తేలిపోవడమే. స్వదేశంలో స్పిన్‌ పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడం టీమిండియాకు అలవాటు. ఇప్పుడు మన బలమే బలహీనతగా మారింది. మన స్పిన్ ఉచ్చు మన మెడకే చుట్టుకుంటోంది. దాంతో రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ సైమన్‌ డౌల్‌ స్పందించాడు.

స్పిన్‌ను భారత్ బాగా ఆడుతుందనే తప్పుడు అభిప్రాయం ఉందని కామెంటేటర్ సైమన్‌ డౌల్‌ పేర్కొన్నాడు. ‘స్పిన్‌ను భారత్ బాగా ఆడుతుందనే తప్పుడు అభిప్రాయం ఉంది. టీమిండియా ఆటగాళ్లు కూడా అందరిలాగే. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌, వీవీఎస్ లక్ష్మణ్‌ రోజులు వెళ్లిపోయాయి. ఇప్పుడు భారత్ ఆటగాళ్లు స్పిన్‌ ఆడలేక తడబడుతున్నారు. ఐపీఎల్‌లోనూ బంతి కాస్త తిరగగానే కుప్పకూలుతున్నారు. భారత్ తయారు చేస్తున్న పిచ్‌ల కారణంగా సగటు స్పిన్నర్లు కూడా టాప్ ఇండియన్ ఆటగాళ్లను అవుట్ చేస్తున్నారు’ అని సైమన్‌ డౌల్‌ అన్నాడు.

‘న్యూజిలాండ్‌పై ఓటమి అనంతరం భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళుతుంది. అక్కడ బౌన్సీ పిచ్‌లపై మంచి ప్రదర్శన చేయడం అంత తేలిక కాదు. అయితే మునుపటి రెండు సిరీస్ విజయాలు భారత జట్టుకు సానుకూలం అని చెప్పాలి. న్యూజిలాండ్‌పై భారీ ఓటమి కారణంగా ఆసీస్‌పై బలంగా పుంజుకుంటుందని భావిస్తున్నా. అందరూ ఆస్ట్రేలియా-భారత్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని సైమన్‌ డౌల్‌ తెలిపాడు.

Show comments