NTV Telugu Site icon

Rohit Sharma: 365 రోజుల్లో.. 2-3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదు: రోహిత్

Rohit Sharma Press Conference

Rohit Sharma Press Conference

Rohit Sharma About India 46 All Out: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మొదట బ్యాటింగ్‌ చేయాలన్నది కెప్టెన్‌గా తన నిర్ణయమే అని రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్‌ స్వభావాన్ని తాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని చెప్పాడు. 365 రోజుల్లో 2 లేదా 3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదనుకుంటా అని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించాల్సి ఉందని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే కుప్పకూలింది. ఇందుకు కెప్టెన్‌ రోహిత్‌ కారణమంటూ అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.

రెండోరోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ… ‘ముందుగా బ్యాటింగ్‌ చేయాలన్నది కెప్టెన్‌గా నా నిర్ణయమే. స్కోరు చూస్తే బాధ కలుగుతోంది. పిచ్‌ను అర్థం చేసుకోలేకపోయాను. అందుకే ఈ పరిస్థితిలో ఉన్నాం. అయినా 365 రోజుల్లో 2-3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదనుకుంటా. మైదానంలో ఎదురైన సవాలుకు మేం ధీటుగా స్పందించలేకపోయాం. ఈ రోజు మాది కాదు. పిచ్‌పై ఎక్కువగా పచ్చిక లేదు. తొలి రెండు సెషన్ల తర్వాత స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించాం. భారత్‌లో ఎప్పుడు ఆడినా తొలి సెషన్‌ తర్వాత పిచ్‌ కుదురుకుని.. స్పిన్నర్లకు సహకరిస్తుంది. ఈ పిచ్‌ మందకొడిగా ఉందనుకుని కుల్దీప్‌ను తీసుకున్నాం’ అని చెప్పాడు.

Also Read: PKL 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌.. తొలి పోరులో బుల్స్‌తో టైటాన్స్‌ ఢీ!

‘విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో ఆడే బాధ్యతనుతీసుకున్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌ స్థానాలను మార్చాలనుకోలేదు. సాధారణంగా 4, 5, 6 స్థానాల్లో ఆడే సర్ఫరాజ్‌ ఖాన్‌ను నాలుగో స్థానంలో ఆడించాం. పరిస్థితులను కివీస్‌ పేసర్లకు బాగా ఉపయోగించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించాల్సి ఉంది. పంత్‌ మోకాలికి బంతి నేరుగా తాకింది. ఆ మోకాలికి గతంలో శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు మరలా తాకడంతో కాస్త వాపు వచ్చింది. ముందు జాగ్రత్తగా అతడిని బయటికి పంపాం. మూడో రోజు పంత్ మైదానంలో దిగుతాడని ఆశిస్తున్నా. మాకు ఇంకా 3 రోజులు ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి’ అన్ని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.