IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!

  • వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 198/3
  • భారత్ ముందు న్యూజిలాండ్ 199 పరుగుల భారీ లక్ష్యం..
  • డారిల్ మిచెల్ 52 బంతుల్లో 89 పరుగులతో అజేయంగా..
Ind Vs Nz (2)

Ind Vs Nz (2)

IND vs NZ 3rd T20I: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టుకు కివీస్ బ్యాటర్లు గట్టి సవాలు విసిరారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసి.. భారత్ ముందు 199 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (2)ను అర్ష్‌దీప్ సింగ్ రెండో ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు. అయితే ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్, మరో ఓపెనర్ ఫిన్ అలెన్‌తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫిన్ అలెన్ 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వేగంగా 40 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు వేగంగా 86 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ (17) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా.. మిచెల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో అజేయంగా 89 పరుగులు సాధించాడు.

చివర్లో క్రీజులోకి వచ్చిన బెవాన్ జాకబ్స్ లు మిచెల్‌కు అదిరిపోయే సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి ఆఖరి 5 ఓవర్లలో ఏకంగా 52 పరుగులు రాబట్టారు. జాకబ్స్ కేవలం 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ 9.9 రన్ రేట్‌తో 20 ఓవర్లలో 198/3 వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (1/33), అక్షర్ పటేల్ (1/36), నితీష్ కుమార్ రెడ్డి (1/38) తలో వికెట్ పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ (0/40), ప్రిన్స్ యాదవ్ (0/44) ధారాళంగా పరుగులు సమర్పించుకొని వికెట్లు తీయలేకపోయారు.