టీమిండియా ఆటతీరు మారలేదు. న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టులో తడబడిన రోహిత్ సేన.. పూణే టెస్టులోనూ పేలవ ఆట తీరును ప్రదర్శించింది. పూణే తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్.. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఏడు వికెట్లతో చెలరేగి.. ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్. న్యూజిలాండ్ 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది.
16/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ అనంతరం కూడా పరిస్థితి మారలేదు. స్వల్ప వ్యవధిలోనే మిగిలిన వికెట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా (38), యశస్వి జైస్వాల్ (30), శుభ్‌మన్ గిల్ (30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (18 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఒకే ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టడంతో భారత్ స్కోరు 150 దాటేసింది. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
Also Read: 35 Chinna Katha Kaadu: 384 ఎంట్రీలలో ఒకటి.. ’35 చిన్న కథ కాదు’ చిత్రంకు అరుదైన ఘనత!
మిచెల్ శాంట్నర్ (7/53), గ్లెన్ ఫిలిప్స్ (2/26) స్పిన్ దెబ్బకు భారత్ విలవిల్లాడింది. రోహిత్ శర్మ (0), జస్ప్రీత్ బుమ్రా (0) డకౌట్ అయ్యారు. విరాట్ కోహ్లీ (1), రిషబ్ పంత్ (18), సర్ఫరాజ్ ఖాన్ (11), ఆర్ అశ్విన్ (4), ఆకాశ్ దీప్ (6) ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ప్రస్తుతం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. ఓపెనర్లు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. కివీస్ ప్రస్తుతం 132 లీడ్‌లో ఉంది.