NTV Telugu Site icon

IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో చివరి టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను! ప్రయోగాలకు వేళాయే

Ind Vs Ire 2023

Ind Vs Ire 2023

Ireland vs India 3rd T20I Preview: ఐర్లాండ్‌, భారత్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 బుధవారం జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాదించి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కలిపి భారత్‌తో ఆడిన 10 మ్యాచ్‌లు ఓడిన ఐర్లాండ్‌.. సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌ అయినా గెలవాలని చూస్తోంది. డబ్లిన్‌లో రాత్రి 7:30కు మ్యాచ్ ఆరంభం కానుంది. రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్‌ టీమిండియాకు చక్కని అవకాశం.

ఆసియా కప్‌ 2023 ముందు గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం జట్టుకు కలిసొచ్చే విషయం. అయితే మరింత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం వీరిద్దరు మూడో టీ20 మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనున్నారు. నిలకడగా రాణించలేకపోతున్న పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో అవేష్‌ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. సంజు శాంసన్‌కు విశ్రాంతిని ఇచ్చి వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు. అయితే ఆసియా కప్‌ 2023కి బ్యాకప్ కీపర్‌గా శాంసన్‌ ఎంపిక కావడంతో కొనసాగించే అవకాశం లేకపోలేదు.

వాషింగ్టన్‌ సుందర్‌కు విశ్రాంతి కల్పించి షాబాజ్‌ అహ్మద్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. రెండో టీ20తో అరంగేట్రం చేసి అదరగొట్టిన రింకూ సింగ్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌లు తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఇక రెండు టీ20ల్లో విఫలమయిన తిలక్ వర్మ ఈసారి సత్తాచాలని చూస్తున్నాడు. యువ భారత్ మరోసారి ఐర్లాండ్‌ను చిత్తుచేయాలని చూస్తోంది.

Also Read: Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు! రూ. 1500 పెరిగిన వెండి

రెండు టీ20 మ్యాచ్‌లలో ఐర్లాండ్‌ ఆటతీరు పేలవంగా లేకున్నా.. యువ భారత్‌కు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. అందులకే చివరి టీ20లో ఐరిష్ జట్టు చెలరేగే అవకాశం ఉంది. గతంలో మంచి ప్రదర్శనలు చేసినా టీమిండియాను ఓడించడంలో ఐర్లాండ్‌ సఫలం కాలేకపోయింది. ఇక డబ్లిన్‌లో వాతావరణంనేడు మబ్బు పట్టి ఉంటుంది. ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నా.. మ్యాచ్‌ పూర్తిగా జరగొచ్చు.