BCCI Awards 2024: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రిలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్మానించనుంది. హైదరాబాద్‌లో ఈరోజు జరిగే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2023 మేటి క్రికెటర్ (క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023) అవార్డుతో గిల్‌ను, జీవితకాల సాఫల్య పురస్కారంతో రవిశాస్త్రిని సత్కరించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా 2019 తర్వాత బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మళ్లీ ఈ ఏడాదే జరుగుతున్న విషయం తెలిసిందే.
2023లో వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను శుభ్‌మన్ గిల్‌కు ఈ అవార్డు దక్కనుందని సమాచారం. గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును అందుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది వన్డేల్లో గిల్ 5 సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన గిల్ 2271 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో రాణిస్తున్న గిల్.. టెస్ట్‌ల్లో, టీ20ల్లో మాత్రం మోస్తరు ప్రదర్శనకే పరిమితమయ్యాడు. 20 టెస్ట్‌ల్లో 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీలతో 1040 పరుగులు.. 14 టీ20ల్లో ఓ సెంచరీ, ఓ అర్ధసెంచరీతో 335 పరుగులు చేశాడు.
Also Read: IND vs ENG: తెలుగు అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం!
భారత క్రికెట్ జట్టుకు రవిశాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డుతో సత్కరించనుంది. 1983 భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. రెండు పర్యాయాలు భారత జట్టుకు హెడ్ కోచ్ కూడా. రవిశాస్త్రి హయాంలో భరత్ జట్టు అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు సభ్యులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారని తెలుస్తుంది. భారత మాజీలు కూడా బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారట.