Rishabh Pant to Bat in Second Innings Despite Injury: మాంచెస్టర్‌లోని నాలుగో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాకు శుభవార్త. జట్టు కోసం గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఈ విషయాన్ని కోచ్ సితాన్షు కొటక్ పరోక్షంగా ధ్రువీకరించాడు. పంత్ తప్పకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడని తాను అనుకుంటున్నా అని పేర్కొన్నాడు. కాలికి తీవ్ర గాయమైనా తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు జట్టు కష్టాల్లో ఉంది కాబట్టి అతడు తప్పకుండా క్రీజులోకి వస్తాడని టీమిండియా ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ కాలికి గాయమైంది. పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడగా.. బంతి ముందుగా బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి ఆపై పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. నొప్పి భరించలేక పంత్ తన షూ తీయగా.. రక్తం కారింది. బంతి తాకిన చోట వాపు వచ్చింది. ఫిజియో వచ్చి చికిత్స చేసినా నొప్పి తగ్గకపోవడంతో వాహనంలో డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. జట్టు అవసరాల కోసం నొప్పిని భరిస్తూ రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. కీపింగ్ బాధ్యతలను మాత్రం ధ్రువ్ జురెల్‌కు అప్పగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ 669 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (87), శుభ్‌మన్ గిల్ (78) ఉన్నారు. భారత్ ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. నేడు ఆటకు చివరి రోజు. ఈ టెస్టులో గిల్ సేన ఓడిపోకుండా ఉండాలంటే.. ఆదివారం కనీసం రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి పరుగులు చేయాల్సి ఉంది. రాహుల్, గిల్ తర్వాత ప్రధాన బ్యాటర్‌గా ఉంది రిషబ్ పంత్ మాత్రమే. పంత్ తర్వాత ఆల్‌రౌండర్లు జడేజా, ఠాకూర్, సుందర్ బ్యాటింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో పంత్ తప్పకుండా బ్యాటింగ్ చేస్తాడని సితాన్షు కొటక్ చెప్పుకొచ్చాడు. జట్టు కోసం పంత్ తప్పకుండా బ్యాటింగ్ చేస్తాడని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ‘భారత్.. ఊపిరి పీల్చుకో, ఆడు వచ్చేస్తున్నాడు’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
చివరి రోజు ప్రతి బంతి కీలకమే అని, భారత బ్యాటర్లు బాగా ఆడతారని తాను భావిస్తున్నా అని సితాన్షు కొటక్ తెలిపాడు. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడమే ఇప్పుడున్న ఏకైక దారి అని పేర్కొన్నాడు. అనవసరమైన రిస్క్ షాట్లకు పోకూడదని, క్రీజులో కుదురుకున్నాక షాట్లు ఆడితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. ఇకపై బ్యాటింగ్ చేయాల్సిన ఆటగాళ్లంతా నాణ్యమైన క్రికెటర్లే అని చెప్పాడు. పంత్ మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటాడని, తప్పకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడని సితాన్షు ధీమా వ్యక్తం చేశాడు. పంత్ గాయంకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించిన విషయం తెలిసిందే.