NTV Telugu Site icon

Rohit-Kuldeep: రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్!

Rohit Kuldeep

Rohit Kuldeep

Rohit Sharma, Kuldeep Yadav Get Into Heated Argument Over DRS Call: వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ ‘డబుల్‌ హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. 230 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 129 పరుగులకే ఆలౌట్‌ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (87) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

లక్ష్య ఛేదనలో కుల్దీప్ యాదవ్ వేసిన 22వ ఓవర్ 5వ బంతిని ప్రమాదకరమైన లియామ్ లివింగ్‌స్టోన్ ఎదుర్కొన్నాడు. లియామ్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించగా.. బాల్ అతడి ప్యాడ్‌ను తాకింది. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఆన్-ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకోలేదు. అటు టీమిండియా ప్లేయర్స్ కానీ.. ఇటు బౌలర్ కుల్దీప్ కానీ రోహిత్‌ను డీఆర్ఎస్ తీసుకోమని కోరలేదు. కుల్దీప్ కాన్ఫిడెంట్‌గా లేడు.. రోహిత్ శర్మకూ అదే చెప్పాడు. దాంతో రోహిత్ డీఆర్ఎస్ తీసుకోకుండా ఉండిపోయాడు.

Also Read: Rohit Sharma: మేం 30 పరుగులు తక్కువ చేశాం.. మా బౌలర్లు సూపర్!

అయితే బిగ్ స్క్రీన్‌లోని రీప్లేలు బంతి ఇన్ పిచ్ అయి లెగ్-స్టంప్‌కు తగిలినట్లు చూపించాయి. రివ్యూ తీసుకుని ఉంటే.. లియామ్ లివింగ్‌స్టొన్ అవుట్ అయ్యేవాడు. అప్పటికీ భారత్ వద్ద రెండు రివ్యూలు ఉన్నాయి. రివ్యూ చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలర్ కుల్దీప్ యాదవ్ దగ్గరకు వెళ్లి ఫైర్ అయ్యాడు. బంతి వేసిన నీకు తెలియదా?.. రివ్యూ తీసుకోవాల్సిందని రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌ మాటలు వినడం తప్ప మరో మార్గం లేని కుల్దీప్ ఏమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు లియామ్ లివింగ్‌స్టోన్ బతికిపోయా అన్నట్లు ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకుసంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.