England to travel to Abu Dhabi before IND vs ENG 3rd Test: హైదరాబాద్‌లో తొలి టెస్టులో ఓటమికి.. విశాఖలో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మరో రోజు మిగిలి ఉండగానే ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. 399 పరుగుల ఛేదనలో ఇంగ్లిష్ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. భారత్ విజయంలో జస్ప్రీత్ బుమ్రా (3/46), ఆర్ అశ్విన్ (3/72) కీలక పాత్ర పోచించారు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. ఇక మూడో టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో ఆరంభమవుతుంది. అయితే ఈ టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టు అబుదాబికి వెళ్లనుంది.
మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల గ్యాప్ రావడంతో ఇంగ్లండ్ టీమ్ అబుదాబికి వెళ్లనుంది. అబుదాబిలో ఇంగ్లీష్ జట్టు విశ్రాంతి తీసుకోనుంది. ఇంగ్లండ్ టీమ్ ప్లేయర్స్ కుటంబసభ్యులు కూడా అబుదాబికి చేరుకోనున్నట్లు సమాచారం తెలుస్తోంది. 2-3 రోజుల విశ్రాంతి అనంతరం మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ చేయనుంది. స్పిన్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి.. ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఇంగ్లండ్ ప్లేయర్స్ గోల్ఫ్ కూడా ఆడనున్నారట. ఫిబ్రవరి 13న ఇంగ్లండ్ టీమ్ నేరుగా రాజ్‌కోట్‌కు చేరుకునే అవకాశం ఉంది.
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి ముందు ఇంగ్లండ్ టీమ్ అబుదాబిలో ప్రాక్టీస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో తొలి టెస్టుకు మూడు రోజుల ముందు వారు భారత్‌కు చేరుకున్నారు. ఈ శిబిరంలో ప్రధాన దృష్టి భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంపైనే పెట్టారు. హైదరాబాద్‌లో బాగానే ఆడిన ఇంగ్లీష్ ప్లేయర్స్.. విశాఖలో మాత్రం చేతులెత్తేశారు. నాల్గవ టెస్టు రాంచీలో, ఆఖరి టెస్ట్ ధర్మశాలలో జరగనుంది.