NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తాం: బీసీసీఐ

Virat Kohli Bcci

Virat Kohli Bcci

ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ముందే అనుకున్నట్లుగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరమయ్యాడని, అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం అని బీసీసీఐ తెలిపింది. మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ ఎంపికయినా.. ఆపై తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ దూరమయ్యాడు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ జట్టుకు ఎంపికయ్యాడు. సిరీస్ ఆరంభ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. అయితే అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో విరాట్ జట్టు నుంచి తప్పుకున్నాడని బీసీసీఐ పేర్కొంది. చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు కూడా వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరమయ్యాడని, అతడి నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని, పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. విరాట్ స్థానంలో రజత్ పటిదార్ జట్టులోకి వచ్చాడు. ఉప్పల్ టెస్టులో చోటు దక్కకపోయినా.. విశాఖ టెస్టులో అవకాశం దక్కించుకున్నాడు.

Also Read: Mithun Chakraborty: గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ నటుడు మిథున్ చక్రవర్తి!

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7 నుంచి ఐదవ టెస్టు ధర్మశాలలో జరగనుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్-ఇంగ్లండ్ 1-1తో సమంగా నిలిచాయి.