NTV Telugu Site icon

IND v ENG: భారత్‌కు అచ్చొచ్చిన ఉప్పల్‌ మైదానం.. అశ్విన్‌కు తిరుగేలేదు!

Uppal Stadium

Uppal Stadium

Team India Uppal Stadium Records: ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య హైదరాబాద్‌ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై సంప్రదాయ పిచ్‌లపై ఎదురులేని భారత్‌.. బాజ్‌బాల్‌ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్‌ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు వేదికైన ఉప్పల్‌ స్టేడియం పిచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఉప్పల్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందా? లేదా బౌన్స్‌తో కూడిన పేస్‌కు సహకరిస్తుందా? అన్న చర్చ మొదలైంది. అయితే ఉప్పల్‌ మైదానంలో భారత్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

టెస్టుల్లో భారత్‌కు కలిసొచ్చిన వేదికల్లో ఉప్పల్‌ కూడా ఒకటి. ఉప్పల్‌ స్టేడియంలో ఐదు టెస్టులాడిన భారత్‌.. నాలుగింట్లో గెలుపొందింది. 2010లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. ఆపై న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లపై గెలిచింది. ఉప్పల్‌లో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లాడిన అశ్విన్‌.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. యాష్ ఆడిన అన్నింట్లోనూ భారత్‌ గెలవడం విశేషం. ఇక్కడ రవీంద్ర జడేజా (15), ఉమేశ్‌ యాదవ్‌ (15) కూడా రాణించారు. మాజీలు ప్రజ్ఞాన్‌ ఓజా (9), హర్భజన్‌సింగ్‌ (7) కూడా వికెట్స్ పడగొట్టారు.

Also Read: IND vs ENG: కేఎల్ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయడు.. కేఎస్ భరత్‌కు లైన్ క్లియర్!

ఉప్పల్‌లో తొలిసారిగా 2010 నవంబర్‌ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్టు జరిగింది. ఆ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. హర్భజన్‌ సింగ్‌ (111 నాటౌట్‌; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. 2012 ఆగస్టు 23 నుంచి 26 వరకు న్యూజిలాండ్‌తో భారత జట్టు రెండో టెస్టు ఆడింది. ఆర్ అశ్విన్ 12 వికెట్లు తీయడంతో భారత జట్టు ఇన్నింగ్స్‌ 115 పరుగుల తేడాతో గెలిచింది. 2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. చతేశ్వర్‌ పుజారా (204) డబుల్‌ సెంచరీ చేశాడు. 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఉప్పల్ వేదికపై నాలుగో టెస్టు జరిగింది. విరాట్‌ కోహ్లీ (204; 24 ఫోర్లు) డబుల్‌ సెంచరీతో భారత్ విజయం సాధించింది. 2018లో ఉప్పల్‌లో చివరిసారిగా వెస్టిండీస్‌తో భారత్ టెస్టు ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది.