ప్రతీ టెస్టు సిరీస్ తర్వాత ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును బీసీసీఐ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన అవార్డును.. గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చాక కూడా బీసీసీఐ కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ అనంతరం ఫీల్డింగ్‌లో మెరిసిన ఆటగాళ్లకు అవార్డును ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించారు. ఈసారి ఇద్దరు ప్లేయర్లకు దక్కడం విశేషం. వెనక్కి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన మహ్మద్ సిరాజ్‌తో పాటు సిరీస్ ఆసాంతం అద్భుత ఫీల్డింగ్ చేసిన యశస్వి జైస్వాల్‌కు అవార్డు దక్కింది.
Also Read: World Cup: భారత్‌లో మరో వరల్డ్ కప్.. ఇదే మొదటిసారి!
భారత జట్టులోని ప్రతి ఒక్కరూ మైదానంలో చురుగ్గా వ్యవహరించారని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అభినందించాడు. ‘మ్యాచులో ఫీల్డింగ్ ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. చాలా అవకాశాలను బాగా ఒడిసిపట్టారు. చెన్నై వంటి ఉక్కపోతగా ఉండే వాతావరణంలోనూ అందరూ అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. కాన్పూర్‌లో వర్షం కారణంగా మైదానం చాలా తేమగా ఉన్నా.. ఏమాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. ప్రతిఒక్కరూ మైదానంలో చురుగ్గా కదిలారు. ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డు రేసులో యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, రోహిత్ శర్మ నిలిచారు. ఫీల్డింగ్‌లోనూ రోహిత్ నమ్మదగ్గ క్రికెటర్. యశస్వి, సిరాజ్ అద్భుతంగా క్యాచ్‌లు అందుకున్నారు. ఈసారి జైస్వాల్, సిరాజ్‌కు అవార్డును అందిస్తున్నాము’ అని దిలీప్ చెప్పాడు.