NTV Telugu Site icon

IND vs BAN: నేడు బంగ్లాతో భారత్‌ మ్యాచ్.. తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులు! 2007 ప్రపంచకప్‌లో షాక్

Ind Vs Ban Teams

Ind Vs Ban Teams

IND vs BAN Preview and Prediction: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ మరో సమరానికి సిద్ధమైంది. నేడు పుణేలో జరిగే పోరులో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆసీస్, అఫ్గన్, పాక్‌లను అలవోకగా ఓడించిన భారత్.. బంగ్లాపై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. భారత్ జోరు చూస్తుంటే విజయం ఖాయమే అనిపిస్తోంది. మరోవైపు ప్రధాన ఆటగాళ్లెవరూ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న బంగ్లా.. విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

ప్రస్తుతం ఉన్న ఊపులో సొంతగడ్డపై భారత జట్టును ఎదుర్కోవడం బంగ్లాదేశ్‌కు అంత తేలిక కాదు. కానీ ప్రపంచకప్‌లో భారత్‌కు షాక్ ఇచ్చిన ఘనత బంగ్లా సొంతం. 2007 ప్రపంచకప్‌లో భారత జట్టును బంగ్లా ఓడించింది. టీమిండియాను 191 పరుగులకు ఆలౌట్ చేసిన బంగ్లా.. మరో 9 బంతులు మిగులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక భారత్‌పై రెండు వన్డే సిరీస్‌లు కూడా గెలిచింది. కాబట్టి పుణెలో బంగ్లా నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చు. బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు.

భారత్ టాప్ ఆర్డర్ ఫామ్ మీదుంది. డెంగీ జ్వరం నుంచి కోలుకుని పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఆడిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. త్వరగా ఔటైపోయాడు. అతను ఓ భారీ ఇన్నింగ్స్‌ ఆడటానికి బంగ్లా మ్యాచ్‌ మంచి అవకాశం. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్‌ పాండ్యా, ఆర్ జడేజాలకు టోర్నీలో బ్యాటింగ్‌ పరీక్ష ఇంకా ఎదురు కాలేదు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్‌, జడేజా ప్రదర్శన మెరుగుపడాలి.

బంగ్లాదేశ్‌ జట్టులో కొందరు ప్రమాదకర ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ ప్రపంచ మేటి ఆల్‌రౌండర్లలో ఒకడు. అయితే షకిబ్‌ గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మెహిదీ మిరాజ్‌ ఫామ్‌లో ఉన్నాడు. పేస్‌ విభాగంలో ముస్తాఫిజుర్‌, తస్కిన్‌ అహ్మద్‌, షోరిఫుల్‌ బాగా ఆడుతున్నారు. ముస్తాఫిజుర్‌కు భారత్‌ మీద మంచి రికార్డు కూడా ఉంది. బ్యాటింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ శాంటో అత్యంత కీలకం. పుణే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. గతంలోనూ ఇక్కడ భారీగా పరుగులు వచ్చాయి. బుధవారం జల్లులు కురిసినా.. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.

Also Read: Rohit Sharma: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. వివాదంలో రోహిత్‌ శర్మ!

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లీ, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌/అశ్విన్‌, కుల్దీప్, బుమ్రా, సిరాజ్‌.
బంగ్లాదేశ్‌: లిటన్‌ దాస్‌, తాంజిద్‌ హసన్‌, నజ్ముల్‌ శాంటో, మెహిదీ హసన్‌ మిరాజ్‌, షకిబ్‌ (కెప్టెన్‌), ముష్ఫికర్‌ రహీమ్‌, హృదోయ్‌, మహ్మదుల్లా, తస్కిన్‌, షోరిఫుల్‌, ముస్తాఫిజుర్‌.