NTV Telugu Site icon

Rohit Sharma: యూటర్న్ తీసుకోవడం ఓ జోక్‌గా మారింది.. క్రికెటర్లపై మండిపడిన రోహిత్!

Rohit Sharma Press Conference

Rohit Sharma Press Conference

Rohit Sharma About Take U-Turns on Retirements: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్మెంట్ ఇవ్వడం.. ఆపై యూటర్న్ తీసుకోవడం సాధారణమైపోయింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్, పాకిస్తాన్ సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్‌లు రిటైర్మెంట్ ఇచ్చి.. మళ్లీ జాతీయ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా మరలా జట్టు తరఫున ఆడేందుకు ప్రయత్నాలు చేశాడు. మరికొందరు ప్లేయర్స్ కూడా రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రిటైర్మెంట్ ఇచ్చి యూటర్న్ తీసుకోవడం ఓ జోక్‌గా మారింది అని మండిపడ్డాడు.

జియో సినిమాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ప్రస్తుత రోజుల్లో ప్రపంచ క్రికెట్‌లో రిటైర్మెంట్ అనేది ఓ జోక్‌గా మారింది. క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఆడతారు. అదృష్టవశాత్తు భారతదేశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను ఇతర దేశాల ఆటగాళ్లను గమనిస్తున్నాను. రిటైర్మెంట్ ప్రకటిస్తారు కానీ యూ-టర్న్ తీసుకుంటున్నారు. ఎందుకు రిటైర్మెంట్ ఇస్తున్నారో వారికే తెలియదు. అలా చేస్తే వారిపై వారికి నమ్మకం ఎలా ఉంటుంది. నా విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. నా నిర్ణయం ఫైనల్. టీ20 క్రికెట్ నుండి వీడ్కోలు చెప్పడానికి ఇది సరైన సమయం అని భావించా’ అని చెప్పాడు.

Also Read: IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు నేడే.. భారత తుది జట్టులో ఎవరెవరు? మూడో స్పిన్నర్‌గా యువ బ్యాటర్

టీ20 ప్రపంచకప్‌ 2024 అనంతరం రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. కొత్తతరం బాధ్యత వహించాల్సిన సమయం ఆసన్నమైందని, యువకులకు అవకాశం ఇవ్వాలనే తాను తప్పుకుంటున్నా అని రోహిత్ తెలిపాడు. భారత్ తరపున 159 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 140.89 స్ట్రైక్ రేట్‌తో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్‌ టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో రోహిత్‌ శర్మ కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో 36.71 సగటుతో 257 పరుగులు చేశాడు.

 

Show comments