Mahmudullah T20 Retirement: టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మదుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు 38 ఏళ్ల మహ్మదుల్లా ప్రకటించాడు. అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరిగే మూడో టీ20నే చివరిది అని చెప్పాడు. ఇక తాను వన్డే ప్రపంచకప్ 2027 కోసం సన్నదమవుతానని పేర్కొన్నాడు. మహ్మదుల్లా 2021లోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
నిజానికి టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని మహ్మదుల్లా భావించాడు. కానీ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ కోరిక మేరకు ఇప్పటివరకు కొనసాగాడు. 2007లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అతడు బంగ్లా తరఫున 138 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో 2394 పరుగులు చేయగా.. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 40 వికెట్లు తీసాడు. టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా మహ్మదుల్లా రికార్డుల్లో నిలిచాడు.
‘టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. టీమిండియాతో జరిగే మూడో టీ20నే చివరి మ్యాచ్. భారత్ వచ్చే ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కుటుంబం, సన్నిహితులతో చర్చించాను. బంగ్లాదేశ్ కోచ్, కెప్టెన్, సెలెక్టర్, ప్రెసిడెంట్‌కు విషయం చెప్పాను. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావించా. మరో మూడేళ్లలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. వన్డే క్రికెట్‌పై ఫోకస్ చేస్తా’ అని మహ్మదుల్లా చెప్పాడు.