NTV Telugu Site icon

IND vs BAN: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆలౌట్‌.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం!

India Target

India Target

కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 47 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. షద్మాన్ ఇస్లామ్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. ముష్ఫికర్ రహీమ్ (37) రాణించాడు. టీమిండియా బౌలర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్స్ పడగొట్టారు. భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ లక్ష్య చేధనకు దిగనుంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్ 285/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

ఓవర్‌నైట్ 26/2 స్కోరుతో చివరిరోజైన మంగళవారం ఆటను ప్రారంభించిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మొమినల్ హక్‌ను అశ్విన్‌ ఔట్ చేశాడు. లెగ్‌ సైడ్‌లో రాహుల్ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. కెప్టెన్ షాంటో (19)తో కలిసి షద్మాన్‌ ఇస్లామ్ (50) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కుదురుకున్న ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. షాంటోను జడేజా, ఇస్లామ్ను ఆకాష్ వెనక్కి పంపారు.

Also Read: The Goat OTT: విజయ్‌ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ‘ది గోట్‌’! స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

లిటన్ దాస్ (1), షకిబ్ (0)ను జడేజా.. మెహిదీ హసన్ (9), తైజుల్ ఇస్లామ్‌ (0)ను బుమ్రా అవుట్ చేశాడు. ముష్ఫికర్‌ రహీమ్‌ క్రీజ్‌లో పాతుకుపోయి.. భారత బౌలర్లను కాస్త విసిగించాడు. ఖలెద్‌ (5 నాటౌట్)తో కలిసి ఆరు ఓవర్ల పాటు క్రీజులో నిలబడ్డాడు. చివరి వికెట్ కావడంతో లంచ్‌ బ్రేక్‌ సమయాన్ని అంపైర్లు పొడిగించారు. ఎట్టకేలకు ముష్ఫికర్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్‌కు తెర పడింది. ఈ టెస్టులో భారత్ సునాయాస విజయం సాధించే అవకాశం ఉంది.