Rishabh Pant To Replace Dhruv Jurel in IND vs BAN 1st Test: ఆరు నెలల తర్వాత భారత జట్టు టెస్టు క్రికెట్‌లో బిజీ అవుతోంది. నాలుగు నెలల వ్యవధిలో పది టెస్టులు ఆడబోతున్న టీమిండియా.. నేడు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభిస్తోంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో గురువారం తొలి టెస్ట్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లా అదే ఊపులో భారత్‌నూ దెబ్బ కొట్టాలని చూస్తోంది. బంగ్లా ఒకప్పట్లా తేలిగ్గా లొంగదనడానికి ఛాన్స్ లేదు. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరును చూడొచ్చు.
భారత తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారు. శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఆడనుండగా.. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వరుసగా 4,5 స్థానాల్లో ఆడతారు. పంత్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్‌కు నిరాశ తప్పదు. గత జనవరిలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కేఎల్ రాహుల్‌గాయపడగా.. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఆడాడు. సర్ఫరాజ్ వరుస మ్యాచులలో హాఫ్ సెంచరీలు చేసినా.. సీనియర్ రాహుల్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపుతోంది. రాహుల్ ఆరో స్థానంలో ఆడతాడు.
బౌలర్లు అయిదుగురు ఎవరన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. స్వదేశంలో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగడం సాధారణమే. అలా చూస్తే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ పేస్ కోటాలో.. ఆర్ అశ్విన్, ఆర్ జడేజాలకు తోడు కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్ స్పిన్ కోటాలో ఆడాలి. అయితే చెన్నై వికెట్‌ను పేస్‌కు కూడా సహకరించేలా తీర్చిదిద్దుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో ఒక స్పిన్నర్ తగ్గించుకుని మూడో పేసర్‌గా ఆకాశ్ దీప్ లేదా యశ్ దయాళ్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను మూడో స్పిన్నర్‌గా ఉపయోగించుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నారట.
ప్రస్తుతం బంగ్లాదేశ్ సూపర్ ఫామ్‌లో ఉంది. పాకిస్థాన్‌లో చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోవడంలో స్పిన్నర్లదే కీలక పాత్ర. మెహిదీ హసన్ మిరాజ్, షకిబ్ అల్‌హసన్ సహా తైజుల్ ఇస్లామ్, నయీమ్‌లు చెలరేగుతున్నారు. సీనియర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మిరాజ్ ఫామ్‌లో ఉన్నారు. షకిబ్, నజ్ముల్ శాంటో, మొమినుల్ హక్ ఫామ్ అందుకుంటే బ్యాటింగ్ మరింత బలోపేతమవుతుంది. పేస్ బౌలర్‌లు నహిద్ రాణా, సీనియర్ తస్కిన్ అహ్మద్ జోరుమీదున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న బంగ్లాతో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), యశస్వి, శుభ్‌మన్, కోహ్లీ, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/యశ్ దయాళ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ శాంటో (కెప్టెన్), షాద్మన్, జాకిర్ హసన్, మొమినుల్, ముష్ఫికర్, షకిబ్, లిటన్ దాస్, మెహిదీ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహ్మద్, తస్కిన్ అహ్మద్.