NTV Telugu Site icon

IND vs BAN: నేటి నుంచే రెండో టెస్టు.. పిచ్‌, ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఇవే!

Ind Vs Ban

Ind Vs Ban

నేటి నుంచి ఆరంభమయ్యే చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొంటుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్వదేశంలో రికార్డు స్థాయిలో 18వ టెస్టు సిరీస్‌ విజయంపై కన్నేసిన టీమిండియా.. కాన్పూర్‌లోనూ బంగ్లాను చిత్తు చేయాలని చూస్తోంది. మంచి ఫామ్ మీదున్న రోహిత్‌ సేనను ఆపడం బంగ్లాకు పెను సవాలే. తొలి టెస్టులో దెబ్బతిన్న బంగ్లాదేశ్‌ పుంజుకోవాలని భావిస్తోంది.

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అర్ధ శతకంతో రాణించాడు. గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తాచాటాడు. పునరాగమనంలో పంత్ మెరిశాడు. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు రాణించాలని భారత్ కోరుకుంటోంది. బౌలింగ్‌లో భారత్‌కు ఏ సమస్యలూ లేవు. ఆర్ ఆశ్విన్‌ మరోసారి బంతితో మాయ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. జడేజా సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇద్దరిని ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు కష్టమైన పనే. ఈ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయమే. బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో కుల్దీప్‌ ఆడే అవకాశాలు మెండు. సిరాజ్‌, ఆకాష్ పేస్‌ భారాన్ని పంచుకుంటారు.

తొలి టెస్టులో విఫలమైన బంగ్లాదేశ్‌ తుది జట్టులో మార్పులు చేసే అవకాశముంది. ఈ మ్యాచ్‌కు షకిబ్‌ అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది. పేస్‌ బౌలర్‌ నహీద్‌ రాణా స్థానంలో స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. పాకిస్తాన్ జట్టుపై చెలరేగిన బంగ్లా స్పిన్నర్లు కాన్పూర్‌లో సత్తాచాటాలని చూస్తున్నారు. అయితే ఒత్తిడిలో ఉన్న బంగ్లా ఇప్పుడు రోహిత్ సేనపై పైచేయి సాధించాలంటే అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే.

కాన్పూర్‌లో నల్లమట్టి పిచ్‌పై బౌన్స్‌ తక్కువగా ఉంటుంది. మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ పిచ్‌ మందకొడిగా మారుతుంది. వర్షం పడితే పిచ్‌లో మార్పు ఉండొచ్చు. గ్రీన్‌పార్క్‌లో ఇదివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చు. ఆట ఆఖర్లో వెలుతురు సమస్య ఎదురుకావొచ్చు. వర్షం వల్ల తొలి, మూడో రోజు ఆట సజావుగా సాగే అవకాశాలు తక్కువ.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్, యశస్వి, గిల్, కోహ్లీ, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్‌, బుమ్రా/ఆకాష్.
బంగ్లాదేశ్‌: షద్మాన్, జాకీర్‌ హసన్, శాంటో, మొమినుల్‌ హక్, ముష్ఫికర్, షకిబ్, దాస్, మిరాజ్, తైజుల్, హసన్‌ మహమూద్, తస్కిన్‌.