IND Playing 11 vs BAN For 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాను ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే ఊపులో కాన్పూర్ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తోంది. అంతేకాదు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది. కాన్పూర్ పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందన్న వార్తల నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పు జరిగే అవకాశం ఉంది.
సాధారణంగా కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అందుకే భారత్ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పెసలిస్ట్ స్పిన్నర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆడటం ఖాయం. మూడో స్పిన్నర్ ఎవరా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తారా? లేదా బ్యాటింగ్ బలోపేతం కోసం అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా? అనేది చూడాలి. కుల్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఎక్స్‌ట్రా స్పిన్నర్ రాకతో ఒక పేసర్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారని తెలుస్తోంది. దాంతో మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ తుది జట్టులో కొనసాగనున్నారు. బ్యాటింగ్ విభాగంలో మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. గిల్, కోహ్లీ, పంత్, రాహుల్‌లు వరుసగా బ్యాటింగ్ చేయనున్నారు. మొదటి టెస్టులో గిల్, పంత్, అశ్విన్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
Also Read: Samsung Galaxy M15 5G Price: 10 వేలకే శాంసంగ్ 5జీ ఫోన్.. సూపర్ కెమెరా, బిగ్ బ్యాటరీ!
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.