Rishabh Pant Set To Play Test Cricket: మరికొద్ది గంటల్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఆరు నెలల తర్వాత టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. మరోవైపు భారత జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 632 రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇంత విరామం ఫామ్ లేమి వల్లనో లేదా గాయం వల్లోనో వచ్చింది కాదన్న విషయం తెలిసిందే.
2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల కోసం న్యూఢిల్లీ నుండి స్వగ్రామం రూర్కీకి వెళుతుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు ఓవర్ స్పీడ్ కారణంగా డివైడర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొట్టిన కారులో అకస్మాత్తుగా మంటలు కూడా చెలరేగాయి. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి.. కారు అద్దం పగలగొట్టి పంత్‌ను బయటికి తీసి ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. గాయాల నుంచి పంత్ పూర్తిగా కోలుకుని పోటీ క్రికెట్ ఆడడానికి 15 నెలలు పట్టింది.
Also Read: Rohit Sharma: యూటర్న్ తీసుకోవడం ఓ జోక్‌గా మారింది.. క్రికెటర్లపై మండిపడిన రోహిత్!
ఐపీఎల్ 2024తో రిషబ్ పంత్ పునరామనం చేశాడు. 16వ సీజన్లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. దాంతో టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు. మెగా టోర్నీలోనూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆపై శ్రీలంక పర్యటనలో టీ20లు, వన్డేలు ఆడాడు. ఎట్టకేలకు ఇప్పుడు టెస్టు క్రికెట్లోకి పంత్ పునరామగనం చేస్తున్నాడు. చివరగా అతను టెస్టు మ్యాచ్ ఆడింది బంగ్లాదేశ్‌తోనే కావడం విశేషం. జట్టులోకి పంత్ రావడంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు నిరాశ తప్పదు.