NTV Telugu Site icon

World Cup Final 2023: టీమిండియాకు కలిసొచ్చిన బుధవారం.. ఇక ఛాంపియన్ రోహిత్ సేననే!

World Cup Final 2023 Trophy

World Cup Final 2023 Trophy

India have a Wednesday Sentiment in ODI World Cups: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో 70 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు గురువారం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా.. మెగా టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్ 19న భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని జ్యోతిష్యులు సహా ఫాన్స్ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.

బుధవారం (నవంబర్ 15) న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని ప్రముఖ జ్యోతిష్యులు ముందే చెప్పగా.. అది నిజమైంది. భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తుందని జ్యోతిష్యులు సహా క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 2011 నుంచి వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశం టైటిల్ గెలుస్తుందని, ఇప్పుడే భారత్ విశ్వవిజేత అవుతుందని అభిమానులు అంటున్నారు. తాజాగా మరో విషయం తెరపైకి వచ్చింది. టీమిండియాకు బుధవారం కలిసొస్తుందని, ఇక ఛాంపియన్ రోహిత్ సేననే అని సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు భారత్ రెండుసార్లు విజేతగా నిలవగా.. ఆ రెండు సందర్భాల్లోనూ భారత్ తన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను బుధవారమే ఆడి గెలిచింది. ఈసారి కూడా బుధవారం సెమీస్ ఆడి గెలుపొందింది.

Also Read: IND vs AUS: భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. విజేత కెప్టెన్‌కు ట్రోఫీని అందజేయనున్న..! లక్కీ ఫెలో

1983 ప్రపంచకప్‌లో భారత్ జూన్ 22 సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది. బుధవారం జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో వెస్టిండీస్‌ను చిత్తుచేసి మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2011లో మార్చి 30న పాకిస్తాన్‌తో భారత్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడి గెలిచింది. ఆ రోజు కూడా బుధవారమే. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. 2023లో నవంబర్ 15న న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడి గెలిచింది. యాదృచ్ఛికంగా ఆ రోజు కూడా బుధవారమే. దాంతో టీమిండియాకు బుధవారం కలిసొస్తుందని, ఫైనల్‌లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తుచేస్తుందని ఫాన్స్ అబిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ సెంటిమెంట్ నిజమవుతుందో లేదో.