Site icon NTV Telugu

IND vs AUS: మొన్న గిల్, నిన్న జితేష్.. ఇక సంజు శాంసన్ పనైపోయినట్లేనా?

Sanju Samson

Sanju Samson

ఆస్ట్రేలియాతో మెల్బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ వరకు టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్ సంజు శాంసనే. గత 12 నెలల్లో సంజు మూడు అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. కానీ శుభ్‌మాన్ గిల్‌కు జట్టులో చోటిచ్చేందుకు సంజు బ్యాటింగ్ ఆర్డర్ మారింది. గిల్ కారణంగా ఓపెనింగ్ చేసే సంజు.. మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. ఇప్పుడు జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఏకంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఇక సంజు మరలా తిరిగి జట్టులో రావడమా కష్టమేనా?

ఆసియా కప్‌ 2025కు ముందు జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం లభిస్తుందని, శుభ్‌మాన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని భావించారు. కానీ జట్టు యాజమాన్యం సంజు శాంసన్‌ను ఎంచుకుని.. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. ఈ నిర్ణయం కొంతవరకు విజయవంతమైంది. టోర్నీలో సంజు రాణించాడు. ఫైనల్‌లో తిలక్ వర్మ, సంజు భాగస్వామ్యం టిమిండియాను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చింది. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో అతడిని 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సూర్యకుమార్ యాదవ్‌ను కాన్‌బెర్రాలో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. మెల్‌బోర్న్‌లో సంజు 3వ స్థానంలో వచ్చినా ఫలితం లేకుండా పోయింది. మూడవ మ్యాచ్ (హోబార్ట్)లో జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం దక్కింది.

నిజం చెప్పాలంటే.. హోబార్ట్ మ్యాచ్‌లో జితేష్ శర్మ బాగా ఆడాడు. చివరి రెండు మ్యాచ్‌లలో అతడే కొనసాగనున్నాడు. జితేష్ రాకతో ఇప్పుడు రాబోయే నెలల్లో సంజు శాంసన్‌ భవిష్యత్తు ఏమిటనేది పెద్ద ప్రశ్నగా మారింది. జితేష్ మిడిల్ ఆర్డర్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటే.. ఇక సంజుకు జట్టులో స్థానం ఉండదు. సంజు ఓపెనర్‌గా చాలా పరుగులు చేశాడు. మూడు సెంచరీలు కూడా చేశాడు. కానీ శుభ్‌మాన్ గిల్‌కు స్థానం కల్పించడానికి అతనిపై వేటు వేశారు. సంజు 5వ స్థానంలో అంతగా విజయవంతం కాలేదు. కానీ ఆ స్థానంలో తగినంత అవకాశాలు లభించాయా? అంటే లేదనే చెప్పాలి. ఆస్ట్రేలియాలో 3వ స్థానంలో ఒకే ఒక్కసారి బ్యాటింగ్ చేసి విఫలమయ్యాడు. నిజానికి గిల్, సూర్య కూడా ఆ మ్యాచ్‌లో విఫలమయ్యారు. ముగ్గురూ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ పరిస్థితిలో ఒకే ఒక్క వైఫల్యం తర్వాత సంజును తొలగించడం న్యాయమా?. మూడో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కాబట్టి సంజు భవిష్యత్తు ఏమిటి?. అతన్ని రెండవ వికెట్ కీపర్‌గా ఉంచుతారా లేదా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం అతనికి కష్టమేనా? ఇక అనే అనుమానాలు కలుగుతున్నాయి.

 

Exit mobile version