NTV Telugu Site icon

Virat Kohli: ప్రపంచకప్‌ ట్రోఫీ రాకపోయినా.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ మనోడికే దక్కింది!

Virat Kohli Player Of The Tournament

Virat Kohli Player Of The Tournament

Virat Kohli Wins Player of the Tournament: వన్డే ప్రపంచకప్‌ 2023 సందడి ముగిసింది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది. ఆరంభంలో తడబడిన ఆసీస్.. టోర్నీ చివరలో గొప్పగా ఆడి ఏకంగా కప్ ఎగరేసుకుపోయింది. ఆరంభం నుంచి గొప్పగా ఆడిన భారత్.. తుది మెట్టుపై బోల్తా పడింది. దాంతో మూడోసారి వన్డే ప్రపంచకప్‌ గెలవాలన్న భారత్ ఆశ గంగపాలైంది. నాకౌట్ పోరులో మరోసారి ఒత్తిడికి చిత్తైన టీమిండియా.. 140 కోట్ల భారతీయుల కలను చిదిమేసింది.

ఆస్ట్రేలియా విజయంలో సూపర్ సెంచరీతో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (137 పరుగులు; 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు) హీరోగా నిలిచాడు. సెంచరీ చేసిన హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు కింగ్ విరాట్ కోహ్లీకి దక్కింది. మెగా టోర్నీలో ఆడిన 11 మ్యాచుల్లో విరాట్ 765 పరుగులు చేశాడు. ఇందులో 9 సార్లు 50 ప్లస్ చేయగా.. 3 సెంచరీలు బాదాడు. ఈ అవార్డు కోసం రోహిత్ శర్మ, మహ్మద్ షమీ పోటీ పడ్డారు. కానీ ఐసీసీ నియమించిన ప్యానెల్, అభిమానులు కోహ్లీకే ఓటేశారు.

Also Read: IND vs AUS Final 2023: ఛేదనలో నా గుండె దడ పెరిగింది: ప్యాట్‌ కమిన్స్

వన్డే ప్రపంచకప్‌ 2023 దక్కకపోయినా.. కనీసం ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు అయినా వచ్చిందని టీమిండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ మనదే అంటూ సోషల్ మీడియాలో కొందరు ఫాన్స్ ఆనందపడుతున్నారు. ప్రపంచకప్‌ 2023లో విరాట్ అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. కీలక సమయంలో జట్టుకు విలువైన పరుగులు చేశాడు. ఈ టోర్నీలోనే సచిన్ టెండూల్కర్ (49) సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు.