NTV Telugu Site icon

IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. పీకల్లోతు కష్టాల్లో భారత్!

Team India Test

Team India Test

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4)లు ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా 310 పరుగుల వెనకంజలో ఉంది. ఫాలో ఆన్‌ తప్పించుకోవాలంటే రోహిత్ సేన మరో 111 పరుగులు చేయాలి.

ఓవర్‌నైట్ 311/6 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (140) సెంచరీ చేశాడు. సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57), మార్నస్ లబుషేన్ (72)లు హాఫ్ సెంచరీలు చేయగా.. పాట్ కమిన్స్ (49), అలెక్స్ కేరీ (31)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. డెంజరస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (0), మిచెల్‌ మార్ష్‌ (4) అవుట్ అయినా.. కమిన్స్, స్మిత్, కేరీలు భారీ స్కోరుకు దోహదపడ్డారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2 వికెట్స్ పడగొట్టారు.

Also Read: Rohit Sharma Captaincy: రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఫైర్!

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (82) ఆచితూచి ఆడాడు. కేఎల్ రాహుల్ (24) యశస్వికి మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ సమయంలో కమిన్స్‌ అద్భుతమైన బంతికి రాహుల్ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం యశస్వికి విరాట్ కోహ్లీ (36) కలిశాడు. ఈ జోడి ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. మంచి ఊపుమీదున్న యశస్వి రనౌట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్‌లో కీలక మలుపు తిరిగింది. కాసేపటికే కోహ్లీ సహా నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్‌ దీప్‌ (0) పెవిలియన్ చేరారు. భారత్ ఇప్పటికే సగం వికెట్లను కోల్పోవడంతో మూడో రోజు తొలి సెషన్‌ అత్యంత కీలకం కానుంది.