ఆస్ట్రేలియాపై మంచి రికార్డు కలిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈసారి మాత్రం నిరాశ పర్చుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించిన పిచ్‌పై సీనియర్ అయిన విరాట్.. తన బలహీనతతో ఔట్ కావడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఆడి మరీ వికెట్ కీపర్‌కు దొరికిపోయాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇలా ఔట్ కావడం మూడోసారి. దీంతో కోహ్లీపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విరాట్.. ఆ బంతి ఆడటం అవసరమా? అని ప్రశ్నించారు.
ఛానెల్ 7లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘యశస్వి జైస్వాల్ అత్యుత్తమ షాట్ ఆడలేదు. భారత్ ముందు 445 పరుగులు ఉన్నాయి. ఈ సమయంలో బ్యాటర్ దృష్టి పరుగులపై మాత్రమే ఉండాలి. బంతిని దూరంగా ఫ్లిక్ చేయడానికి యశస్వి ప్రయత్నించాడు. ఇది ఒక సాధారణ క్యాచ్. మంచి ఫీల్డింగ్ ప్లేసింగ్, పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ చాలా బాగుంది. ఇక విరాట్ కోహ్లీకి ఆ బంతిని ఆడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాలుగో స్టంప్ మీద బంతిని విసిరితే ఆడేందుకు ప్రయత్నిస్తే ఓకే. కానీ ఇక్కడ బంతి మరీ దూరంగా వెళ్తోంది. ఆ బంతిని ఆడాల్సిన అవసరమే లేదు. కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. కాస్త ఓర్పు ప్రదర్శించి ఉంటే.. కేఎల్ రాహుల్‌తో కలిసి క్రీజ్‌లో ఉండేవాడు. విరాట్ పేలవ షాట్‌తో అభిమానులను షాక్‌కు గురి చేశాడు’ అని అన్నారు.
Also Read: IND vs AUS: దిమాక్ ఉందా?.. ఆకాశ్ దీప్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం!
మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషబ్ పంత్ (9) నిరాశపర్చారు. కేఎల్ రాహుల్ (33), రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది.