NTV Telugu Site icon

AUS vs IND: ఐయామ్ ఇంప్రెస్‌డ్.. బుమ్రాపై ఆసీస్‌ మాజీ క్రికెటర్ ప్రశంసలు!

Jasprit Bumrah

Jasprit Bumrah

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత జట్టు సారథిగా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కుమారుడు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. మొదటి టెస్టులోనే బౌలర్‌గానే కాకుండా.. సారథ్యంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు. కీలక క్యాచ్ వదిలేసినా అసహనం వ్యక్తం చేయని కెప్టెన్ బుమ్రాపై ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ప్రశంసలు కురిపించాడు.

తొలి టెస్టులో విరాట్ కోహ్లీ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అయినా కెప్టెన్‌ బుమ్రా ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. మార్నస్ లబుషేన్‌ వంటి డేంజరస్‌ బ్యాటర్‌ను ఔట్ చేసే అవకాశం మిస్‌ అయినా.. చిరునవ్వు చిందించాడు. ఈ సందర్భంలో మరొకరైతే అరిచేవారు. కనీసం మందలించేవారు. బుమ్రా మాత్రం ఇవేమీ చేయకపోగా.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ఇది చూసిన ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. బుమ్రాప్రవర్తించిన తీరుకు తాను ఇంప్రెస్ అయ్యానని చెప్పాడు. బుమ్రా రియాక్షన్‌ అద్భుతం అని, ఫర్వాలేదు అన్నట్లు ప్రవర్తించాడని పేర్కొన్నాడు.

ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ మాట్లాడుతూ… ‘బౌలర్ అయిన బుమ్రా ఇప్పుడు కెప్టెన్. అతడే బౌలింగ్ చేస్తున్నాడు. అప్పటికే ఓ వికెట్‌ తీసిన ఉత్సాహంలో ఉన్నాడు. ఆ సమయంలో లబుషేన్ను ఔట్ చేసే అవకాశం వచ్చింది. స్లిప్‌లో కోహ్లీ మంచి క్యాచర్ కానీ.. అతడి చేతి నుంచి బంతి చేజారింది. అయినా బుమ్రా రియాక్షన్‌ అద్భుతం. చిరునవ్వు చిందించాడు. ప్రతిఒక్కరూ అతడిలా పాజిటివ్‌ దృక్పథంతో ఉండటం బాగుంది. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎంతటి మేటి బ్యాటరైనా కష్టపడాల్సిందే. ఏ క్షణంలోనూ తలొంచాడు. వికెట్‌ కొద్దిలో చేజారినప్పటికీ.. అతడి బౌలింగ్ యాక్షన్, స్టైల్, టెక్నిక్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ విషయంలో బుమ్రా అద్భుతం. దానికి నేను కూడా ఇంప్రెస్‌ అయ్యా. బౌలర్‌గానే కాకుండా సారథ్యంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు’ అని చెప్పాడు.

Show comments