India Playing XI vs Pakistan in ICC Cricket World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023ని భారత్ ఘనంగా ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో పసికూన అఫ్గానిస్తాన్‌నుపై భారీ విజయం సాధించింది. ఇక భారత్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాయాది పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మెగా టోర్నీలో అసలు సిసలు పోరైన ఇండో-పాక్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది. అయితే కీలక మ్యాచ్ కాబట్టి భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
డెంగ్యూ జ్వరం బారిన పడిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కోలుకున్నాడు. బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న గిల్.. గురువారం ప్రాక్టీస్ చేశాడు. తనకు కలిసొచ్చే అహ్మదాబాద్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు గిల్ సిద్ధంగా ఉన్నాడు. గిల్ రీఎంట్రీ ఇస్తే.. మరో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితం అవుతాడు. శనివారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం గిల్ పాకిస్థాన్‌పై ఆడటంపై టీమిండియా మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఓపెనర్‌గా రోహిత్ శర్మకు జతగా గిల్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
3, 4, 5, స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆడుతారు. కోహ్లీ సెంచరీ, హాఫ్ సెంచరీ చేయగా.. రాహుల్ శతకం బాదాడు. గత మ్యాచ్‌లో శ్రేయస్ కూడా ఫామ్ అందుకున్నాడు. అఫ్గాన్‌తో శ్రేయస్ రాణించడంతో సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. పాకిస్థాన్‌పై టాప్ ఆర్డర్ రాణిస్తుందని మేనేజ్‌మెంట్ నమ్మకంగా ఉంది. 6, 7 స్థానాల్లో ఆడే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. గత మ్యాచ్‌లో హార్దిక్ 11 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
Also Read: Oppo Find N3 Flip Price: భారత మార్కెట్లోకి ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్.. ధర, ఫీచర్స్ ఇవే!
బౌలింగ్ కాంబినేషన్‌లోనూ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. లేదంటే ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఆడుతుంది. స్పిన్‌కు అనుకూలంగా ఉంటే శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఆర్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే యాష్ బెంచ్‌కే పరిమితమవుతాడు. ఇక అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన మహమ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది. పాకిస్థాన్ మ్యాచ్ కీలకం కాబట్టి సిరాజ్ స్థానంలో సీనియర్ మహమ్మద్ షమీ ఆడే అవకాశం ఉంది.
భారత్ జట్టు (అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్/శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ/మహమ్మద్ సిరాజ్.