Site icon NTV Telugu

Earthquake In Taiwan: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు

Earthquake In Taiwan

Earthquake In Taiwan

Earthquake In Taiwan: తైవాన్‌ (Taiwan) దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. యుజింగ్ జిల్లాలో (Yujing district) రాత్రి పలుమార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు భయాందోళన చెందిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దక్షిణ తైవాన్‌లో సోమవారం రాత్రి మొదట 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటన యుజింగ్ జిల్లాలోని తైనన్ నగరానికి 4 కి.మీ దూరంలో చోటుచేసుకుంది. ఆపై అదే ప్రాంతంలో 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి దాటాక 6.4 తీవ్రతతో మరో భారీ భూకంపం (6.4 magnitude earthquake) సంభవించగా కొన్ని ఇల్లు కూలిపోయాయి.

Also Read: IND vs ENG: రేపటి నుంచే భారత్- ఇంగ్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌..

ఈ భూకంపం కారణంగా దక్షిణ తైవాన్‌లో 27 మంది గాయపడ్డారు. చియాయి కౌంటీలోని దాపు టౌన్‌షిప్‌లో భూకంప కేంద్రం గుర్తించారు. ఇది 9.4 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. నాన్క్సీ జిల్లాలో ఓ ఇల్లు కూలిపోగా, ఆ ఇళ్లలో చిక్కుకున్న ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. దక్షిణ తైవాన్‌ మాత్రమే కాకుండా భూకంప ప్రభావం రాజధాని తైపీ వరకు కూడా కనిపించింది. రాజధానిలో కొన్ని భవనాలు కంపించాయి కూడా. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. తైవాన్ ప్రభుత్వం భూకంప బాధితుల రక్షణ కోసం రెస్క్యూ చర్యలను వేగవంతం చేసింది. కూలిన ఇళ్ల వద్ద సహాయ చర్యలు చేపడుతూ, ప్రాణ నష్టం నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. భూకంపాల‌కు ఎక్కువగా గురయ్యే తైవాన్‌లో ఇటీవలి కాలంలో ఇది మరో పెద్ద భూకంపం. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Exit mobile version