IND vs BAN: సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ లో జరగనుంది. తొలి మ్యాచ్‌కి టీమిండియాను ఇప్పటికే ప్రకటించారు. అయితే బంగ్లాదేశ్ ఇంకా జట్టును ప్రకటించలేదు. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు జట్ల మధ్య భారత్‌దే పైచేయి. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు జరగగా అందులో భారత్ 11 మ్యాచ్‌లు గెలుపొందగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇంత అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ, రోహిత్ మరియు బృందం బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవడానికి లేదు. దీనికి కారణం ఇటీవల బంగ్లాదేశ్ జట్టు 2-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలిసారిగా పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌కి సంబంధించిన కొన్ని అద్భుతమైన రికార్డుల గురించి ఒకసారి చూద్దాం..
టెస్టులో కోహ్లీ 9 వేల పరుగులు:
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌లో మరో భారీ మైలురాయిని సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లి 152 పరుగులు చేస్తే, టెస్టు క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలవనున్నాడు. ప్రస్తుతం కోహ్లి 113 టెస్టుల్లో 8848 పరుగులు చేశాడు.
సెహ్వాగ్‌ని దాటనున్న రోహిత్:
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ మరో 7 సిక్సర్లు బాదితే, టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటివరకు 54 టెస్టులాడిన రోహిత్ 84 సిక్సర్లు బాదాడు.
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో అశ్విన్:
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచే ఛాన్స్ అశ్విన్ కు ఉంది. బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ 5 వికెట్లు తీస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సార్లు ఈ ఫీట్ చేసిన బౌలర్ గా రికార్డులకెక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ తో సమానంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 10 సార్లు 5 వికెట్లు తీసుకున్న ఘనత సాధించారు. ఇందులో నంబర్-1గా ఉండాలనుకుంటే అశ్విన్ ఇంకా ఒక్కసారి మాత్రమే 5 వికెట్లు తీయాలి.