NTV Telugu Site icon

Navy Chief: 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా భారత నావికాదళం.. తొలిసారిగా నేవీలో మహిళా నావికులు

Navy Chief

Navy Chief

Navy Chief: భారత నావికాదళం 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా మారుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేవీ డే సందర్భంగా శనివారం మీడియాతో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇటీవలి సంఘటనలు మన భద్రతా అవసరాల కోసం ఇతరులపై ఆధారపడలేమని నిరూపించాయని.. ఆత్మనిర్భర్‌గా ఉండటానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందని నేవీ చీఫ్ చెప్పారు. తమ దృష్టి అంతా 2047 నాటికి భారత నావికాదళాన్ని పూర్తిగా ఆత్మనిర్భర్‌గా మార్చడంపైనే ఉందని.. భారత నావికాదళంలో స్వదేశీకరణను సాధించే ప్రయత్నాలను వివరిస్తూ ఆయన అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకల కదలికలు పెరగడంపై నేవీ చీఫ్ స్పందిస్తూ, భారతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రాంతంలో జరిగే అన్ని పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు.

త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కింద భారత నౌకాదళంలోకి అగ్నివీరులను నియమించారు. వీరిలో మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ తెలిపారు. తొలిసారిగా మహిళలను నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్‌ కింద దాదాపు 3000 మంది అగ్నివీరులను నేవీలోకి తీసుకున్నామని.. ఇందులో 341 మంది మహిళలు ఉన్నారన్నారు. తొలిసారిగా నేవీలో మహిళా నావికులను నియమించామని ఆయన చెప్పారు. మహిళా నావికులకు కూడా పురుషుల తరహాలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. శారీరక దారుఢ్యం మొదలైనవాటితో సహా అన్నింటిలో శిక్షణ ఇస్తామన్నారు.

ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది నౌకాదళ అనుభవజ్ఞుల స్థితికి సంబంధించిన ప్రశ్నకు నేవీ చీఫ్ స్పందిస్తూ, ఈ సమస్యను అత్యున్నత స్థాయిలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌లో నేవీ వాటా 17.8 శాతంగా ఉందని, ఇది చాలా సరిపోతుందని నేవీ చీఫ్ చెప్పారు. క్యాపిటల్ టు రెవిన్యూ నిష్పత్తి 32:68గా ఉంది, ఇది చాలా మంచిదని ఆయన తెలిపారు. గత ఏడాది కాలంలో నౌకాదళం అనేక కీలక కార్యక్రమాలు చేపట్టిందని అడ్మిరల్‌ కుమార్‌ అన్నారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్‌ను ప్రారంభించడం నావికాదళానికి, దేశానికి మైలురాయి అని ఆయన అన్నారు.

Gujarat Assembly Polls: గుజరాత్‌ ఎన్నికలు.. ముగిసిన రెండో దశ ప్రచారం

1971 ఇండో-పాక్ యుద్ధంలో ‘ఆపరేషన్ ట్రైడెంట్’లో భారత నావికాదళం పాత్రను గుర్తించి, సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికి డిసెంబర్ 4ని ప్రతి సంవత్సరం నేవీ డేగా జరుపుకుంటారు.ఈ ఏడాది తొలిసారిగా దేశ రాజధాని వెలుపల విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. భారత నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, తూర్పు, పశ్చిమ, దక్షిణ నౌకాదళ కమాండ్‌కు చెందిన ప్రత్యేక దళాలు ఈ సందర్భంగా భారత నావికాదళ సామర్థ్యాన్ని, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తాయి.

Show comments