NTV Telugu Site icon

Extreme Winter: ఈ ఏడాది గజగజ వణికించనున్న చలి.. ఐఎండీ వార్నింగ్

Whatsapp Image 2024 10 02 At 12.53.23 Pm

Whatsapp Image 2024 10 02 At 12.53.23 Pm

Extreme Winter: దేశం మొత్తానికి రుతుపవనాలు వీడ్కోలు పలకబోతున్నాయి. అక్టోబర్ 15 నాటికి రుతుపవనాలు పూర్తిగా కనుమరుగవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఐఎండీ ప్రకారం, ఈ సంవత్సరం దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పరిసర ప్రాంతాల్లో ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ సంవత్సరం మొదట మండే వేడి, తరువాత అధిక వర్షం, ఇప్పుడు చలికాలం గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

చలి తీవ్రంగా ఉంటుందని ఎందుకు చెబుతున్నారు?
అక్టోబర్-నవంబర్ సమయంలో లానినా యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఐఎండీ ప్రకారం, అక్టోబర్-నవంబర్‌లో లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం 71 శాతం వరకు ఉంది. అయితే చలి ఎంత ఉంటుందో కచ్చితమైన అంచనా నవంబర్‌లోనే వస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెలలో లానినా చురుకుగా ఉంటే, డిసెంబర్, జనవరి నెలల్లో తీవ్రమైన చలి ఉండవచ్చు. లానినా సాధారణంగా ఉష్ణోగ్రతల తగ్గుదలకు కారణమవుతుంది. దీని కారణంగా చలికాలంలో కూడా వర్షాలు ఎక్కువగా ఉంటాయి.

లానినా ప్రభావం ఎలా ఉంటుంది?
లానినా సమయంలో తూర్పు గాలులు సముద్రపు నీటిని పడమటి వైపుకు నెట్టివేస్తాయి. దీని కారణంగా సముద్రం ఉపరితలం చల్లగా మారుతుంది. ఐఎండీ అంచనాల ప్రకారం, అక్టోబర్, నవంబర్ మధ్య లానినా చురుకుగా ఉండే అవకాశం 71 శాతం ఉంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రకారం, అక్టోబర్-నవంబర్‌లో లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం 71% ఉందని తెలిపారు. లానినా సంభవించినప్పుడు, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర-పశ్చిమ భారతదేశం, చుట్టుపక్కల మధ్య ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుంది.

ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఈ విషయాన్ని చెప్పింది..
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) గత నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుత తటస్థ పరిస్థితులు (ఎల్నినో లేదా లా నినా కాదు) అక్టోబరు-నవంబర్‌లో లానినా పరిస్థితులుగా మారే అవకాశం 55 శాతం ఉందని తెలిపింది. అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు, లానినా బలం 60 శాతానికి పెరిగే అవకాశం ఉందని, ఈ కాలంలో ఎల్‌నినో మళ్లీ బలపడే అవకాశం శూన్యం అని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.