NTV Telugu Site icon

IMD Weather Alert: మోచా తుఫాన్ తీవ్రతపై యంత్రాంగం అప్రమత్తం

Cyclone Mocha1

Cyclone Mocha1

ఎండాకాలం వానాకాలంగా మారింది. ఒకవైపు పంటలు నష్టపోయిన రైతులు లబోదిబోమంటున్నారు. మండువేసవిలో తుఫాన్లు అలజడి రేపుతున్నాయి. ఐఎండి అంచనా ప్రకారం రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుంది దీని ప్రభావంతో ఎల్లుండి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారి ఆతర్వాత ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.

అయితే ప్రస్తుత సమాచారం మేర ఈతుఫాన్‌ బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీరాల దిశగా వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడిన తదుపరి ఐఎండి సమాచారం మేరకు ఇతర వివరాలు తెలియజేస్తామన్నారు. ఏదిఏమైప్పటికీ అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు రేపటిలోగా తిరిగి రావాలని కోరారు. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.

దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

రానున్న మూడు రోజుల వాతావరణ వివరాలు ఎలా ఉంటాయంటే?

శనివారం:-
•అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్,శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

•శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

ఆదివారం:-
•కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

•అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

సోమవారం :-
•చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

•విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

Show comments