Site icon NTV Telugu

Telangana: తెలంగాణలో వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి..!

Ts

Ts

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగ మంటు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదు అవుతున్నాయి. రికార్డు స్థాయిలో మంగళవారం నాడు 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. అయితే, ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు, జైనథ్‌ మండలాల్లో నిన్న (మంగళవారం) గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయిందని పేర్కొన్నారు. ఇక​, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదు కాగా, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40. 8 డిగ్రీల నుంచి 42. 3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.

Read Also: CJI DY Chandrachud: కోర్టు దఫేదార్‌ పట్ల ఆత్మీయ చూపిన సీజేఐ

అయితే, రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్‌’ అలర్ట్ జారీ చేసింది. ఎండలో పని చేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎక్కువగా ఎండలో తిరగరాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. పలు చోట్ల వర్షం కురిసిన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.

Exit mobile version