IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

  • 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
  • రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Imd

Imd

దేశ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. జూన్ నెలలో అంతంత మాత్రంగా ఉన్న వర్షాలు జూలైలో మాత్రం దంచికొడుతున్నాయి. గుజరాత్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు అతి వర్ష సూచన చేసింది. ఢిల్లీ, యూపీ, బీహార్, గుజరాత్ సహా 17 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరిక జారీ చేసింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

రేపు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్ష హెచ్చరిక జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో జూలై 26వ తేదీ వరకు చెదురుమదురుగా వర్షాలు కురనున్నాయి. జూలై 27 నుంచి 30వ తేదీ వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జూలై 27వ తేదీ వరకు చెదురుమదురుగా వర్షాలు కురవనున్నాయి. జూలై 28 నుంచి 30వ తేదీ వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రేపు బీహార్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై 25, 27 తేదీల మధ్య అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. జూలై 27, 29 తేదీలలో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో చాలా నదులు, వాగులలో నీటిమట్టం పెరిగి, వరదల ముప్పు ఏర్పడింది. వాతావరణ శాఖ ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నుంచి దక్షిణ కాశ్మీర్, పరిసర ప్రాంతాల్లో వాతావరణం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. జూలై 28 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రాంతంలో మరింత వర్షం కురుస్తుందని కూడా ఆ శాఖ అంచనా వేసింది.