IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

Deepak Reddy

Deepak Reddy

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌ క్యాంపస్‌లో తీవ్ర విషాదం అలముకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి (36) తన క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం నుంచి సహోద్యోగులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడం, ఎంతసేపటికీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో హిజ్లీ ఔట్‌పోస్టు పోలీసులు భద్రతా సిబ్బందితో కలిసి తలుపులు తెరిచి చూడగా, దీపక్ రెడ్డి ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆయన్ను క్యాంపస్‌లోని బీసీ రాయ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘోర ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించేందుకు ఆయన గదిని సీజ్ చేశారు. అయితే అక్కడేమీ సూసైడ్ నోట్ లభించలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఎస్పీ పాపియా సుల్తానా స్పష్టం చేశారు. ఇది ఆత్మహత్యా లేక ఉద్యోగ, వ్యక్తిగత ఒత్తిళ్ల వల్ల జరిగిన ప్రాణనష్టమా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఈ విచారకర సంఘటనపై ఐఐటీ ఖరగ్‌పూర్ యాజమాన్యం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.