New Zealand have won the toss and have opted to field: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొద్ది నిమిషాల్లో ఆరంభం కానుంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కావడంతో టామ్ లాథమ్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. దురదృష్టవశాత్తు కేన్ ఇంకా సిద్ధంగా లేడని టాస్ సమయంలో లాథమ్ చెప్పాడు. కేన్ మామ మొదటి మ్యాచ్‌కు దూరమవుతాడని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గాయాల కారణంగా లుకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, టీమ్ సౌథీ కూడా మ్యాచ్ ఆడడం లేదు.
మరోవైపు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. స్టోక్స్ సహా అట్కిన్సన్, టాప్లీ, విల్లీలు కూడా జట్టుకు దూరమయ్యారు. ఇంగ్లీష్ జట్టులో ఎక్కువ మంది విధ్వంసక బ్యాటర్లే ఉన్నారు. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్,హరీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, జొస్ బట్లర్‌లు ఉన్నారు. ఇంగ్లీష్ జోరును ఆపాలంటే కివీస్ శ్రమించాల్సిందే.
తుది జట్లు:
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, జిమ్మీ నీషమ్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.