ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మెగా టోర్నీలో బుమ్రా ఆడడంపై బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు నేటితో గడువు ముగుస్తుండంతో.. బుమ్రాపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆస్ట్రేలియా పర్యటన చివరలో జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగే మూడో వన్డేలో బుమ్రా ఆడి ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటాడని వార్తలు వచ్చినా . అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో బుమ్రా ఉన్నాడు. దీంతో బుమ్రా ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. బుమ్రాను ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించేందుకు ఎన్‌సీఏ గట్టి ప్రయత్నమే చేస్తోంది. టీమిండియా యాజమాన్యం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని తెలుసుకుంటోంది. మంగళవారం చివరగా బుమ్రాను వైద్య బృందం పరీక్షించి.. ఫిట్‌నెస్ నివేదికను బీసీసీఐకి అందజేయనుంది.
Also Read: Beer Price Hike: తెలంగాణలో బీర్ల ధరలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి!
ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ నిరూపించ్చుకోకుంటే.. అతని స్థానంలో పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. టోర్నీ మధ్యలో అయినా బుమ్రాను ఆడించాలనుకుంటే మాత్రం అతడిని 15 మంది బృందంలో కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా బుమ్రా అందుబాటులోకి రాకుంటే.. కొత్త ఆటగాడి ఎంపికకు ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశలో అయినా బుమ్రా అందుబాటులోకి వస్తే చాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఒకవేళ టోర్నీ మొత్తానికి అతడు దూరమైతే భారత్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడడం ఖాయం.