NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్‌ శర్మకు లాస్ట్ ఛాన్స్.. పునరావృతం అయితే ఇదే చివరి ఐసీసీ టోర్నీ!

Rohit Sharma

Rohit Sharma

స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు భారత్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ రెండు సిరీస్‌లకు బీసీసీఐ సెలెక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టునే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడించే అవకాశం ఉంది. అయితే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మను జట్టుకు ఎంపిక చేస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. దీనిపై బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

ఫామ్ లేమి కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రోహిత్‌ శర్మకు విశ్రాంతిని ఇచ్చి.. హార్దిక్‌ పాండ్యాకు సారథ్యం అప్పగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి రోహిత్ నాయకత్వంలోనే టీమిండియా బరిలోకి దిగబోతోందని బీసీసీఐ వర్గాలు అంటుండగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కూ హిట్‌మ్యాన్‌ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. రోహిత్‌కు చివరి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆసీస్ పర్యటన ప్రదర్శన పునరావృతం అయితే.. రోహిత్‌కు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీకి కూడా అవకాశం ఇవ్వడం ఖాయం. విరాట్ ఫామ్‌ కూడా గొప్పగా లేదు కానీ.. కింగ్ ఆటపై బీసీసీఐ సెలక్టర్లు విశ్వాసం ఉంచనున్నారు. జనవరి 12 లోపు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో బీసీసీఐ జట్లను ప్రకటించనుంది.

Also Read: OnePlus 13 Launch: ‘వన్‌ప్లస్‌ 13’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేశాయి.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌ సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. మోకాలిలో వాపు కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రిషబ్ పంత్‌కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే తుది జట్టులో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కనుంది. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్‌ సింగ్‌లు ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌కు ఎంపిక అవుతారని తెలుస్తోంది.

Show comments